Mahalakshmi Scheme: తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత‌ బ‌స్సు సౌక‌ర్యంలో కీల‌క మార్పు

Free Bus Pass for Women: తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మీ' మరింత సులభతరం కానుంది.

Update: 2025-12-22 07:43 GMT

Free Bus Pass for Women: తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మీ' మరింత సులభతరం కానుంది. బస్సుల్లో ప్రతిసారి జీరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అర్హులైన మహిళలందరికీ ప్రత్యేక ఉచిత బస్ పాస్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ జేఏసీ (JAC) హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఆర్టీసీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, టికెట్ సాఫ్ట్‌వేర్ పద్ధతి కంటే పాస్ విధానం మేలని భావించింది.

ఎందుకు ఈ మార్పు?

మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ సమయంలో ప్రతి మహిళా ప్రయాణికురాలికి గుర్తింపు కార్డు చూసి జీరో టికెట్ జారీ చేయడం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది. జీరో టికెట్ల జారీ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల బస్సు స్టాపింగ్‌ల వద్ద సమయం వృథా అవుతోంది. ఈ ఇబ్బందులను తొలగించాలని, జీరో టికెట్ స్థానంలో స్మార్ట్ కార్డులు లేదా పాస్‌లు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ గత కొంతకాలంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరుతూ వచ్చింది.

మే 6న రవాణా శాఖ మంత్రితో జరిగిన భేటీలో ఈ ప్రతిపాదన రాగా, తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి ఆమోదముద్ర వేయడం పట్ల కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్మార్ట్ కార్డుల ద్వారా ప్రయాణికుల గణన మరింత ఖచ్చితంగా ఉంటుందని, కండక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News