రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం

* మిర్చికి విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలు * మార్కెట్‌లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర

Update: 2021-01-30 09:39 GMT

Red Chili Crop

ఎర్ర బంగారం పండించిన రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. అవును! మిర్చిని ప్రస్తుత ధరతో చూస్తే ఎర్ర బంగారం అని చెప్పక తప్పదు. విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలొస్తున్నాయి. మార్కెట్ లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర పలుకుతుంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మిర్చి రికార్డు ధరను నమోదు చేసింది. ఇంత ధర గతంలో ఎన్నడూ పలకలేదని మార్కెట్ చరిత్ర లోనే ఇది తొలిసారి అంటున్నారు అధికారులు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్. నిత్యం వేలాది మంది రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు విక్రయించేందుకు ఇక్కడికే వస్తుంటారు. అరుదుగా పండించే బ్యాడిగా రకం మిర్చి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రికార్డ్ స్థాయిలో క్వింటాలుకు 24 వేలు పలికింది. తెలంగాణలో అతి అరుదుగా వేసే ఈ మిర్చి పంట ద్వారా కలర్, కెమికల్స్, మెడిసిన్‌కి వాడుతారు.

మిర్చి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో కీలకపాత్ర పోషిస్తున్నది. తెలంగాణ నుంచి 3,63,990 మెట్రిక్ టన్నుల మిర్చిని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల 3,275.91 కోట్ల ఆదాయం లభిస్తున్నది. వరంగల్ జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా సాగు ఖర్చు పెరిగిందని మిర్చి రేట్ బాగానే వస్తున్నా చేతిలో డబ్బులు మిగలడం లేదంటున్నారు రైతులు.

మిర్చి పంట సరిపడ అందుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో మిర్చి వాడకం అధికంగా ఉండటం వల్లే ధర పెరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం మిర్చికి మంచి ధర లభిస్తుందని, రైతులు మార్కెట్‌కు వచ్చేముందే రేట్లపై అవగాహనతో రావాలని మార్కెట్ చైర్మన్ సూచిస్తున్నారు. మొత్తానికి వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో ఎర్ర బంగారం అధిక ధరలతో మిలమిల మెరుస్తోంది. 

Tags:    

Similar News