PV Narasimha Rao Birth Anniversary: ఈరోజు పీవీ నర్సింహరావు శత జయంతి

PV Narasimha Rao Birth Anniversary: వందేళ్ల వేడుకలు జరుపుకుంటోన్న ప్రజలు *పీవీ స్వగ్రామం వంగరలో పీవీ జ్ఞాపకాలు పదిలం

Update: 2021-06-28 02:38 GMT

భరత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (ఫైల్ ఇమేజ్)

PV Narasimha Rao Birth Anniversary: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఈరోజు. పీవీ శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పీవీ వందేళ్ల వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుతోంది. హైదరాబాద్‌ పీవీ మార్గ్‌ జ్ఞానభూమిలో పీవీ శత జయంతి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గవర్నర్ తమిళిసై‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే, పీవీ మార్గ్‌‌లో పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

1921 జూన్‌ 28న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో అమ్మమ్మ ఇంట పీవీ నర్సింహారావు జన్మించారు. ఆ తర్వాత ఆయన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన పీవీ.... ఎన్నో అత్యున్నత పదవులను అధిష్టించారు. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించిన పీవీ నర్సింహారావు.... ఆ తర్వాత భారత ప్రధాని పీఠాన్ని అందుకున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌గా విశేష సేవలు అందించారు. అయితే, పీవీ ఎంత ఎత్తుకి ఎదిగినా ఆయన సొంత గ్రామం వంగరతో ఎనలేని అనుబంధం ఉంది. ఇప్పటికీ పీవీ జ్ఙాపకాలు అనేకం అక్కడ పదిలంగా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరునామాను యావత్ దేశానికి పరిచయం చేసిన మహనీయుడు పీవీ వందేళ్ల శతజయంతి వేడుకల సందర్భంగా hmtv అందిస్తోన్న ప్రత్యేక కథనం.

ఇండియన్ పాలిటిక్స్‌లో పీవీ ఒక సంచలనం ఆ‍యనో చరిత్ర ఆధునిక భారత్‌కు పునాదులు వేసిన రాజనీతిజ్ఞుడు... మూస పద్ధతులకు చరమగీతం పాడి దేశానికి.... కొత్త ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్రపంచీకరణ వైపు నడిపించిన నావికుడు పీవీ. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు... అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు.... అన్నింటిపైనా తనదైన ముద్రవేసిన తెలుగుబిడ్డ పీవీ నర్సింహరావు. భారత ప్రధానిగా దిగ్విజయంగా ఐదేళ్ల సుస్థిర పాలనను అందించి ఆర్థిక సంస్కరణలను చేపట్టి.... ప్రపంచం అబ్బురపడేలా దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన మహనీయుడు.

పీవీ ప్రధాని అయ్యేనాటికి దేశం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. విదేశీ అప్పులు పెరిగిపోయాయి. కొత్త రుణాలు ఇఛ్చేందుకు ఏ విదేశీ సంస్థా ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన పీవీ.... సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాత పద్ధతులకు చరమగీతం పాడుతూ భారత్‌ను విశ్వవిపణికి అనుసంధానం చేశారు. 1992కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసి, తాను దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6 శాతానికి చేర్చారు. ఇన్ఫోసిస్ లాంటి గొప్పు సంస్థలు పుట్టుకురావడం వెనుక దార్శనికత, ధైర్యం వీపీదే. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, శాటిలైట్ టీవీ ఛానెళ్ల వరకు అన్నీ పీవీ పాలనా కాలంలో చేపట్టిన సంస్కరణలే కారణం. పేదల కోసం ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేసింది కూడా పీవీనే. ప్రజాపంపిణీ, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వినూత్న మార్పులకు పీవీ శ్రీకారం చుట్టారు. విదేశాంగ విధానంలో నూతన పంథా అనుసరించారు. అమెరికా ఒత్తిడిని సైతం తట్టుకుంటూ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ధీరుడు పీవీ నర్సింహారావు

1957లో మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా విజయం సాధించారు. 1962 నుంచి 1971వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1971 సెప్టెంబర్ 30న పీవీని ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను ముఖ‌్యమంత్రిగా ఉండగా పీవీ తీసుకొచ్చిన భూ గరిష్ట పరిమితి చట్టం అప్పట్లో పెను సంచలమైంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడమే కాదు, తనకున్న వందల ఎకరాల భూమిని సైతం పేదలకు పంచిన గొప్ప సంఘ సంస్కర్త పీవీ నర్సింహారావు. ఆ తర్వాత రెండుసార్లు హన్మకొండ ఎంపీగా గెలిచిన పీవీ..... మూడోసారి మహారాష్ట్ర రాంటెక్‌ నుంచి పోటీచేసి విజయంసాధించారు. నాలుగో పర్యాయం కూడా రాంటెక్ నుంచి ఎంపీగా గెలిచి తొమ్మిదో లోక్‌సభలో అడుగుపెట్టారు. 1980 నుంచి 90వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1991లో నంద్యాల ఉపఎన్నికలో గెలిచి పదో లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే, దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న పీవీ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపి అపర చాణక్యుడిగా పీవీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగానే కాదు దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ పాలన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. వివిధ దేశాధినేతలను సైతం పీవీకి అభిమానులుగా చేసింది.

ఇక, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రధానిగా ఎదిగిన పీవీని ఠీవీగా చెప్పుకుంటూ గొప్పగా పీలవుతున్నారు తెలుగు ప్రజలు. పీవీకి సముచిత గౌరవం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అలాగే, హుజురాబాద్‌ జిల్లా ఏర్పాటుచేసి పీవీ పేరు పెడతామనడంపైనా హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, పీవీని కూడా తన రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ వాడుకుంటున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News