గర్భిణీలకు ప్రాణసంకటంగా మారుతున్న వరదలు

Asifabad: అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణానికి అవస్థలు

Update: 2022-07-13 06:06 GMT

గర్భిణీలకు ప్రాణసంకటంగా మారుతున్న వరదలు

Asifabad: భారీ వర్షాలు వరదలు గర్భిణీలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో నిండు గర్భిణి 4 గంటలు నరకం చూశారు. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో వరదలకు రోడ్డు దాటే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇంటి నుంచి ఆస్పత్రికి చేరుకునే దాకా అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. రోడ్డు తెగిపోయి  చెట్టు కూలి.. ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పురిటినొప్పులను పంటిబిగువున భరించిన గర్భిణీ బంధువులు, గ్రామస్తులు, పోలీసుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్నారు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన కామేరే విజయ తొలికాన్పు కోసం అదే మొట్లగూడలోని పుట్టింటికి వెళ్లారు. డాక్టర్లు ఆమెకు ఈ నెల 15న డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ మంగళవారం సాయంత్రమే విజయకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆశ వర్కర్ తో కలిసి టాటా ఏస్ వాహనంలో 30 కిలోమీటర్ల దూరంలోని దహెగాం పీహెచ్ సీకీ బయల్దేరారు. ఆరు కిలోమీటర్లు రాగానే భారీ వర్షానికి రోడ్డు తెగిపోయి కనిపించింది. గర్భిణిని అతికష్టం మీద కొద్ది దూరం నడిపించుకుంటూ తీసుకొచ్చిన బంధువులు అటువైపు ఉన్న మరో ఆటోలో పంపించారు.

మరో ఏడు కిలోమీటర్లు వచ్చేసరికి భారీ వర్షాలు వల్ల రాంపూర్ అడవుల్లో చెట్టు రోడ్డుకు అడ్డుగా పడిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ సనత్ కుమార్ రెడ్డి వెంటనే అక్కడకు చేరుకుని చెట్లను తొలగించారు. గర్భిణీని ఆటోలో హస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించారు. మరో 15 కిలోమీటర్లు వెళ్లే సరికి ఒడ్డుగూడ వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుందడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఆటోను వెనక్కి తిప్పి, మరో రూట్లో పికలగుండం మీదుగా వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ లోలెవల్ వంతెన రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. తప్పని సరిపరిస్థితుల్లో స్ట్రెచర్ మీద గర్భిణిని తీసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్ లో దహెగాం పీహెచ్ సీకి తరలించారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న హాస్పిటల్ సిబ్బంది విజయకు పురుడు పోశారు. ఆడశిశువుకు జన్మనివ్వగా,తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అడుగడుగునా ప్రాణగండంతో ఆస్పత్రికి చేరిన గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News