ద్విచక్రవాహనాల సైలెన్సర్లు మాఢీపై చేస్తున్నారా...అయితే ఇక అంతే సంగతి!

Update: 2021-01-31 05:53 GMT

modified bike Silencer (file image)

రయ్‌.. రయ్‌.. మంటూ హైదరాబాద్‌లో షికారు చేస్తున్నారా? కంపెనీ సైలెన్సర్లు మాఢీపై చేయించి మరీ రైడ్‌కు వెళ్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్త. అధిక శబ్దం వచ్చే వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడే వాహనదారులకు సిటీ ట్రాఫిక్‌ పోలీసులు చెక్‌ పెడుతున్నారు. శబ్ద కాలుష్యానికి పాల్పడితే క్రిమినల్‌ కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

బైక్‌కు కంపెనీ అమర్చిన సైలెన్సర్లు తీసేస్తున్నారా? ద్విచక్రవాహనాల సైలెన్సర్లు మాఢీపై చేస్తున్నారా? అయితే మీకు షాకిచ్చేందుకు హైదరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలుష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసేవారి పని పడుతున్నారు. ఇష్టమొచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

ఖరీదైన బైక్‌లు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని హైదరాబాద్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడటంతో శబ్ద కాలుష్యంతోపాటు వృద్దుల ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ పడనుంది. దీంతో నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ దగ్గర ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన పోలీసులు WHO గైడ్‌లైన్స్‌ ప్రకారం 65డెసిబుల్స్‌ సౌండ్‌ మించి శబ్దం వస్తున్న వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఇక సౌండ్‌ పొల్యూషన్‌, ఎయిర్‌పొల్యూషన్‌కు సంబంధించి 1,134 కేసులు నమోదు చేశారు.

WHO నిబంధనలు అతిక్రమిస్తే ఇకపై సహించబోమంటున్నారు సిటీ పోలీసులు. అదేవిధంగా ఎక్కువ సౌండ్‌ వచ్చే సైలెన్సర్లు అమర్చిన మెకానిక్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మెకానిక్‌ షెడ్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఏదేమైన నగర రోడ్లపై రయ్‌ రయ్‌ మనేవాహనాల శబ్దాలకు చెక్‌ పెట్టే దిశగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News