పంచాయతీల ఫలితాలు మా పాలనపై తీర్పు: సీఎం రేవంత్​

పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ పాలనపై తీర్పుగా భావిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2025-12-19 05:40 GMT

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ పాలనపై తీర్పుగా భావిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒకేటేనన్న సీఎం అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్​ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లు అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ ను ఆదరించారని సీఎం హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో 12,702 పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి అయ్యాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్​ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్పారు.

7,522 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్​ పార్టీ గెలిచిందని, 820 సర్పంచ్​ స్థానాలను కాంగ్రెస్​ రెబల్​ అభ్యర్థులు గెలిచారని వివరించారు. 62 శాతం సర్పంచ్​ స్థానాలను కాంగ్రెస్​ పార్టీ గెలిచిందన్నారు. చాలా గ్రామాల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి పని చేశాయని, సహకరించుకున్నాయని ఆరోపించారు. బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి 33 శాతం సీట్లను గెలుచుకున్నాయని పేర్కొన్నారు.

87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఆధిక్యం

‘‘94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఆధిక్యం సాధించింది. బీఆర్​ఎస్​ 6 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు సాధించింది. ముథోల్​ నియోజకవర్గంలో బీజేపీ అధిక స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించాం. రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యం సాధించాం. పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడలేదు. పూర్తిగా స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయి.’’ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలనే తమవారు కాదంటున్నారు

స్పీకర్​ నిర్ణయంపై బీఆర్​ఎస్​ నేతల మాటలు వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమేనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేనట్లుగా బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే తమవారు కాదని బీఆర్​ఎస్​ నేతలు అనటం హాస్యాస్పదమని అన్నారు. ప్రధాని మార్పు గురించి నాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చిస్తాం

‘‘మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీలో ప్రతిపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశాన్ని కూడా సభలో చర్చించి ముందుకెళ్తాం. కేటీఆర్​ కాంగ్రెస్​ గురించి కాకుండా హరీశ్ రావు గురించి ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. హరీశ్ రావు తన వెనకాల తవ్వుతున్నారని కేటీఆర్​ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అయ్యాక అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. కేటీఆర్​ ని తప్పించాలని హరీశ్​రావు వర్గం ఇప్పటికే ప్రచారం చేస్తోందన్నారు. కేటీఆర్​ నాయకత్వాన్ని మార్చాలని హరీశ్​ రావు ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. హరీశ్​ రావు ప్రయత్నాన్ని తిప్పి కొట్టేందుకే కేటీఆర్​ పర్యటనలు చేస్తున్నారు’’ అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News