TS BJP: బీజేపీకి షాక్ మీద షాక్.. పార్టీకి రాజీనామా చేసిన వినయ్ కుమార్ రెడ్డి

TS BJP: నిజామాబాద్ బీజేపీ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి రాజీనామా

Update: 2023-08-16 05:49 GMT

TS BJP: బీజేపీకి షాక్ మీద షాక్.. పార్టీకి రాజీనామా చేసిన వినయ్ కుమార్ రెడ్డి 

TS BJP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచాలని యోచిస్తున్న తెలంగాణ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్న నేతల సంఖ్య పెరుగుతోంది.. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ పార్టీకి ముఖ్య నేత రాజీనామా పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన తన రాజీనామా లేఖలో వెల్లడించారు.

కొంత కాలం నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు, ఆర్మూర్ బీజేపీ ఇంచార్జి వినయ్ కుమార్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల స్టేట్ బీజేపీ ఆఫీసులో అరవింద్ కు వ్యతిరేకంగా వినయ్ కుమార్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా పార్టీనే విడిచిపెట్టారు. ఇంత కాలం పాటు పార్టీకి నమ్మకంగా ఉండి.. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వినయ్ కుమార్ బీజేపీని విడిచిపెట్టడం జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే చర్చకు తావిచ్చింది. ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్మూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకే అవకాశం కల్పిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆకస్మికంగా పార్టీని విడిచివెళ్లారు. .వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వినయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరితే జిల్లా బీజేపీ పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

ఎంపీ అర్వింద్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని వినయ్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, వీటికి విసిగిపోయే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆయన పార్టీకి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికి పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అరవింద్ గెలుపు కోసం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎక్కడ రానంతటి 32వేల మెజారిటీ తీసుక రావడం లో కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు.. ఎంపీ అరవింద్ పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, రోజుకో కొత్త నాయకున్ని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి అంటూ కార్యకర్తలను అయోమయానికి గురి పేర్కొన్నారు. వినయ్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో బీజేపీ నేతలు, అనుచరులు రాజీనామా కు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 18 తర్వాత వినయ్ రెడ్డి కార్యాచరణ వేయనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News