Mother Love: అమ్మ ప్రేమకు అడవి కూడా వణికింది.. పులి చంపిన దూడ వద్దకు అధికారులను తీసుకెళ్లిన తల్లి ఆవు!
Mother Love: జంతువులకు భాష తెలియకపోవచ్చు కానీ భావోద్వేగాలు మనుషుల కంటే ఎక్కువే అని నిరూపించింది ఒక ఆవు.
Mother Love: జంతువులకు భాష తెలియకపోవచ్చు కానీ భావోద్వేగాలు మనుషుల కంటే ఎక్కువే అని నిరూపించింది ఒక ఆవు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటికల పహాడ్ అటవీ ప్రాంతంలో వెలుగుచూసిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఇటికల పహాడ్ గ్రామానికి చెందిన రైతు నగోసే భీంరావుకు చెందిన ఆవు, తన లేగ దూడతో కలిసి మేత కోసం అడవిలోకి వెళ్ళింది. అక్కడ ప్లాంటేషన్ సమీపంలో మాటువేసిన పులి, ఒక్కసారిగా దూడపై దాడి చేసి చంపేసింది. భయంతో తల్లి ఆవు తప్పించుకుని సాయంత్రం ఒంటరిగా ఇంటికి చేరింది. అయితే, తన బిడ్డ లేకపోవడంతో ఆ ఆవు రాత్రంతా మౌనంగా విలపించడం చూసిన యజమాని, ఏదో ఆపద జరిగిందని గ్రహించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
మరుసటి రోజు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. యజమాని ఆవును కట్టె విప్పగానే, అది ఎక్కడా తడబడకుండా నేరుగా అడవిలోకి పరుగెత్తింది. సుమారు కిలోమీటర్ల దూరం అధికారులను తన వెంటే తీసుకెళ్లి, సరిగ్గా తన దూడ మరణించి పడి ఉన్న ప్రదేశం వద్ద ఆగింది. ఆ దృశ్యాన్ని చూసిన అధికారులు, గ్రామస్తులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
చుట్టుపక్కల పాదముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు, పులి దాడి వల్లే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత రైతు భీంరావుకు తక్షణ పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను తీసుకెళ్లవద్దని కాపరులను కోరారు.
చనిపోయిన బిడ్డను వెతుక్కుంటూ అధికారులను నేరుగా ఆ ప్రదేశానికి తీసుకెళ్లిన ఆ ఆవు ప్రవర్తన చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. "నోరు లేని జీవమైనా, కన్నబిడ్డపై ఆ ఆవు చూపిన మమకారం మనుషులకే పాఠం చెప్పేలా ఉంది" అని స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు.