తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు!

Update: 2020-11-09 04:35 GMT

Weather | శీతాకాలం ఆరంభంలోనే చలి పంజా విసరటం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో చలి గిలి పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. ప్రధానంగా ఉత్తర, వాయవ్య తెలంగాణలోని జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 12.7 నుంచి 9.5 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రకటించింది.

ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణుకు పుట్టిస్తోంది. కొమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 9.5, ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లో కూడా ఉదయం పూట చలితీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ఏరియాలోనూ ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. పాడేరు 9, మినుములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కారణంగా దారులు కూడా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

Tags:    

Similar News