తెలంగాణ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meeting: 5 గంటలుగా సాగిన కేబినెట్ సమావేశం

Update: 2022-08-12 01:10 GMT

తెలంగాణ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meeting: వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచి.. రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 గంటలు సాగిన కేబినెట్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 36 లక్షల మంది పెన్షన్ దారులకు.. ఈ పది లక్షలు అధనం కానున్నారు. అలాగే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్‌వాడీ టీచర్లు, మిగతా పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇటు ఈ నెల 21 న అనుకున్న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలకు మంచి రోజులు ఉండటంతో.. ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు అందడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వజ్రోత్సవాల సందర్భంగా.. సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

ఇక కోఠి ENT ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు.. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ENT టవర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని వైద్య ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు.. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

జీవో 58, 59 కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించింది. వికారాబాద్‌ ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం, తాండూరు మార్కెట్ కమిటీకి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. షాబాద్‌లో బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ భేటీలో సమగ్ర చర్చ జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదైందని అధికారులు వివరించారు. కేంద్రం నుంచి నిధులు తగ్గినా.. వృద్ధిరేటు పెరగడంపై చర్చ జరిగింది. FRBM పరిమితుల్లో కోతలు లేకుంటే ఆదాయం మరింత పెరిగేదని.. వృద్ధిరేటు 22 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉండేదని అధికారులు వెల్లడించారు. CSS పథకాల ద్వారా గత 8 ఏళ్లలో రాష్ట్రానికి 47 వేల 312 కోట్ల మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు. అయినా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని తెలపడం జరిగింది. 

Tags:    

Similar News