Bhadradri: నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

Bhadradri: మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం

Update: 2023-03-30 03:34 GMT

Bhadradri: నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

Bhadradri: రఘువంశ రామయ్య, సుగుణాల సీతమ్మ, వరమాలకై వేచు సమయాన.. శివ ధనసు విరిచాక , వధువు మది గెలిచాకే మోగింది కల్యాణ శుభ వీణ. వరుడు రామయ్యగా వధువు సీతమ్మగా కనువిందు చేయగ, కనులు తరించేను, మనసులు పులకించేను, ఆ శుభ ఘడియలకు భద్రాద్రి ముస్తాబైంది. పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణ మహోత్సవం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పువ్వాడ అజయ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం తరలివచ్చారు. గోటి తలంబ్రాలు, ముత్యాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తెస్తూ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వేసవికాలం కావడంతో షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

శ్రీసీతారాముల తిరు కళ్యాణోత్సవం నేడు భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరగనుంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు స్వామి కళ్యాణాన్ని ఆలయంలోనే నిర్వహించారు. కాగా, గతేడాది స్వామి వారి కళ్యాణోత్సవ కార్యక్రమం మిథిలా స్టేడియంలో ఘనంగా జరిగింది. అయితే, ఈ ఏడాది పుష్కర తిరుకళ్యాణోత్సవం జరగనుంది. 12 ఏళ్లకు ఒకసారి పుష్కర కళ్యాణాన్ని నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం కోసం భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు భద్రాద్రికి తరలిరానున్నారు. ఇప్పటికే అశేష జనవాహిని భద్రాచలం చేరుకున్నారు. శ్రీసీతారాముల ఉత్సవ మూర్తులను వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయం నుండి మిథిలా స్టేడియంకు అర్చకులు తీసుకొస్తారు.

Tags:    

Similar News