తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్ ని నియమించారు. ఈ పదవీ బాధ్యతలను సోమవారం జస్టిస్ చంద్రయ్య చేపట్టారు. జస్టిస్ సిస్సార్ అహ్మద్ కక్రూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా 2016 డిసెంబర్ వరకు పనిచేశారు. ఆయన తదనంతరం కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జరగలేదు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య చైర్మన్ గా, హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు వారి పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ ప్రాథమిక హక్కులే మానవ హక్కులని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పదవీబాధ్యతల కార్యక్రమానికి మాజీ న్యాయమూర్తులతో పాటు శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ విచ్చేసి కమిషన్ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.