గ్రేటర్‌ కాలనీల్లో మేటలు వేసిన బురద

Update: 2020-10-17 05:41 GMT

రెండు మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు నగరమంతా సముద్రాన్ని తలపించింది. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ నగరం ఇంకా నీళ్లలోనే నానుతోంది. మరోవైపు డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. అనేక ముంపు ప్రాంతాల్లో రాకపోకలు మెరుగుపడలేదు. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. దీంతో వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరద ముంపు కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అడుగుతీసి అడుగు వేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నగర వాసులకు నరకంగా మారింది. జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి కూడా వీల్లేకుండా మారాయి. కొన్ని అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్లు, కాలనీలు వరద ముంపులో ఉండటంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించక సుమారు 222 వీధులు అంధకారంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలను బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నగరంలో పేరుకుపోయిన బురదను పూర్తిగా శుభ్రం చేయడానికి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఎన్ని రోజులు పడుతుందో, నగరం ఎప్పటికి సాధారణ స్థితి నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి.

ఇక నగరంలో పేరుకుపోయిన వరద నీరు, బురదతో అంటువ్యాధుల భయం పొంచివుంది. టైఫాయిడ్, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరోవైపు ఆగిఉన్న నీటిపై దోమలు తయారయి స్వైరవిహారం చేస్తుండటంతో డెంగీ జ్వరం సోకే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరదలకు జంతువుల కళేబరాలు కొట్టుకొని రావడం, కొన్ని మృత్యువాత పడి అక్కడే పడి ఉండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇళ్లు, షెడ్లలో ఉన్న మేకలు, గొర్రెలు, బర్రెలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. కుళ్లిన పశు కళేబరాలు, బురదతో అంటువ్యాధులు ప్రబలే అవకాశా లున్నాయి. నేషనల్‌ డిజాస్టర్‌ టీమ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌), ఆర్మీ, ఆక్టోపస్‌ బలగాలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కలిసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్‌ చేసి నీటిని క్లియర్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News