హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

Hyderabad: *గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం *భారీ వర్షాలతో తెలంగాణలో రెడ్ అలర్ట్

Update: 2022-07-10 01:04 GMT

హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

Hyderabad: హైదరాబాద్‌ను వానలు మరోసారి ముంచెత్తాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇందులో భాగంగా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఇక నగరంలో భారీ వర్షంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివారు కాలనీలు నీటమునిగాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొత్తగూడ, గచ్చిబౌలిని వాన ముంచెత్తింది.

తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్. అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అలర్ట్ చేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ దృష్ట్యా పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.

జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News