Hyderabad: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. దక్షిణాది మెట్రో నగరాల్లోనే అత్యంత కాలుష్య నగరంగా భాగ్యనగరం!
Hyderabad: దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల జాబితాలో మాత్రం హైదరాబాద్ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది.
Hyderabad: దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల జాబితాలో మాత్రం హైదరాబాద్ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’పై గురువారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB) విస్తుపోయే గణాంకాలను వెల్లడించింది.
ప్రమాదకరంగా ధూళికణాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం.. గాలిలో సూక్ష్మ ధూళికణాల (PM 10) పరిమితి 40 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ, హైదరాబాద్‌లో ఇది 82 నుండి 88 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది. అంటే ఉండాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో కాలుష్యం ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిర్దేశించిన 60 మైక్రోగ్రాముల పరిమితితో పోల్చినా, హైదరాబాద్‌లో 35 శాతం అధిక కాలుష్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఏడాదిలో ఒక్క రోజు కూడా ‘స్వచ్ఛమైన గాలి’ లేదు: గడిచిన ఏడాదిలో ఒక్క రోజు కూడా హైదరాబాద్ గాలి 'స్వచ్ఛమైన గాలి' (Clean Air) విభాగంలో నమోదు కాలేదని పీసీబీ పేర్కొంది. కేవలం 'సంతృప్తిక' లేదా 'మధ్యస్థం' అనే విభాగాల్లోనే నగరం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో పీఎం-10 స్థాయి గరిష్ఠంగా 105 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం.
నగరంలోని 7 కాలుష్య హాట్‌స్పాట్లు: ఐఐటీ కాన్పూర్ అధ్యయనం ఆధారంగా నగరంలో అత్యధికంగా కాలుష్యం నమోదవుతున్న 7 కీలక ట్రాఫిక్ కారిడార్లను పీసీబీ గుర్తించింది:
ఖైరతాబాద్ - కోఠి
జీడిమెట్ల
బీహెచ్‌ఈఎల్ - అమీర్‌పేట
నాంపల్లి - చార్మినార్
మెహిదీపట్నం - హైటెక్ సిటీ - కూకట్‌పల్లి
సికింద్రాబాద్ - సైనిక్‌పురి
ఎల్‌బీ నగర్ - కోఠి
ఈ హాట్‌స్పాట్లలో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణాదిలోని ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లోనే కాలుష్యం అధికంగా ఉండటం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.