Adilabad: ప్రకృతి సిద్ధమైన రంగులతో హోళీ పండుగ

Adilabad: అనాదిగా ఆచారాల్ని పాటిస్తూ హోళీ జరుపుకుంటున్న ఆదివాసులు

Update: 2021-03-28 05:04 GMT

హోలీ (ఫైల్ ఫోటో)

Adilabad: ఏ పండుగైన, ఏ ఉత్సవమైన ఆదివాసులు జరుపుకునే తీరే వేరు. తమ ముత్తాతల కాలం నుండి సనాతనంగా వస్తున్న ఆచార విధానాలను మరువకుండా పాటించే ఆదివాసులు హోలి పండుగను సైతం ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. హోలి అందరికి రంగుల పండగ మాత్రమే కాని ఆదివాసులకు మాత్రం మరో ఉగాది.

ఆదిలాబాద్ జిల్లాలో హోలి పండుగ మరికొన్ని రోజులు ఉందనగా అడవిలోకి వెల్లి గోగు పూలను సేకరిస్తారు అడవి బిడ్డలు. అలా సేకరించిన పూలను మరిగించి సహజసిద్ధమైన రంగులను తీసి హోలి పండుగ రోజు వాడుకోవడానికి సిద్ధంగా ఉంచుతారు. ఈ రంగులు పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన రంగులు కావడంతో శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు కలిగించవు.

హోలి పండుగకు ఒక రోజు ముందు ఆదివాసులు చేసే కామ దహనం ఎంతో ప్రత్యేకమైంది. కామదహనం నాడు స్త్రీ, పురుషులను ఆరాధిస్తు వెదురు బద్దలతో వారి రూపాలను తయారు చేస్తారు. వాటిని రెండు చోట్ల పక్కపక్కనే పేర్చుతారు. ఆ రెండింటిని మాత్రి, మాత్రల్ అంటే చనిపోయిన పెద్దల స్త్రీ రూపం, పురుష రూపాలుగా ఊహించుకుంటారు. ఆ వెదురు బద్దలకు నవధాన్యలు, బూరెలు, ఎండు కొబ్బరిలతో అలంకరిస్తారు.

సాయంత్రం పూట అందరు కలిసి ఆ వెదురు బద్దలకు మంటపెట్టి కామ దహనం నిర్వహిస్తారు. తర్వాత వాటిపై అలంకరించిన ఆహార పదార్థాలు గ్రామంలోని అందరు సహ పంక్తిగా కూచుని భుజిస్తారు. అయితే దహనం తరువాత బూడిదను స్త్రీ రూపం, పురుష రూపాలుగా వేరు చేసి ఇంటికి తీసుకెల్తారు. పురుష రూపంలో ఉన్న బూడిదను ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంచుకుని, స్త్రీ రూపంలో ఉన్న బూడిదను ఆగస్టు నెలలో ఊరు పొలిమెర చుట్టు పోసి వ్యాధులు గ్రామంలో ప్రవేశించకుండా చూస్తారు.

ఇక ఉదయం తెల్లవారకముందు ఎవరింట్లో వారు నవధాన్యాలతో గూడాలు వండుకుని తమ తమ పోలాలలోకి వెల్లి దేవునికి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అందరు ఉగాది రోజు వ్యవసాయాన్ని ప్రారంబిస్తు ఎలా పూజలు చేస్తారో అచ్చం అలానే ఈ ఏడాది పంటలు బాగా పండాలని పూజిస్తారు ఆదివాసులు. ఇక ఆ రోజంతా సహజసిద్ధమైన రంగులతో చిన్న పెద్ద అని తేడా లేకుండా హోలి పండుగా జరుపుకుంటు ఉల్లాసంగా గడుపుతారు.

ఎంతైనా ఆదివాసులు జరుపుకునే తీరు ఎంతో ప్రత్యేకం కదూ ప్రకృతికి అతి దగ్గరగా సహజసిద్ధంగా బతికే అడవి బిడ్డలు అంతే సహజ సిద్ధంగా పండుగలను జరుపుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.

Tags:    

Similar News