Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌కు హైకోర్టు ట్విస్టు

High Court: విచారించండి... వాళ్లను అరెస్టు చేయకండి అంటున్న హైకోర్ట్

Update: 2022-11-20 01:15 GMT

 ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌కు హైకోర్టు ట్విస్టు

High Court: ఎమ్మెల్యేల ఎర కేసులో దూకుడుగా ఉన్న సిట్‌కు హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ఫామ్‌ హౌస్‌లో నిందితులుగా పట్టుబడిన వారిని విచారించిన సిట్ వీరితో సంబంధం ఉన్నవాళ్లకు నోటీసులిచ్చి ఈ నెల 21 తేదీన హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. హారజరుకు కానివారిని అరెస్టుచేస్తామని సిట్ అధికారులు హెచ్చరించారు.

ఇప్పటిదాకా కేరళకు చెందిన తుషార్, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేసింది. ఈ ముగ్గురినీ విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. విచారణ పేరుతో నిందితులను పిలిపించి అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించింది. దర్యాప్తు పేరుతో కేసుతో సంబంధం లేనివారిని సిట్‌ వేధింపులకు గురిచేస్తోందని బిజెపి తరఫు సీనియర్‌ న్యాయవాది సీహెచ్‌.వైద్యనాథన్‌ తెలిపారు.

పార్టీకి చెందిన కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలతో జాతీయస్థాయిలో ప్రభావం ఉంటుందని రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు నోటీసుల జారీకి ఈ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సింగిల్‌ జడ్జికి సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు వివరాలను, సంతోష్‌కు నోటీసులను జారీ చేసిన అంశాన్ని పత్రికలకు వెల్లడించిందని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. సిట్‌ తన పరిధిని దాటుతోందన్న అనుమానం ఉందని, అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడం దర్యాప్తులో భాగమేనని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ పేర్కొన్నారు. దర్యాప్తును అడుగడుగునా అడ్డుకునేందుకే ఇక్కడ పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు. ఏవైనా అనుమానాలుంటే సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చని ధర్మాసనం చెప్పిందని, అంతే తప్ప రోజువారీ దర్యాప్తు వివరాలను నివేదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు నిమిత్తం నోటీసులు అందజేయడంలో సిట్‌ అధికారులకు దిల్లీ పోలీసులు సహకరించడం లేదని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు తెలిపారు.  

Tags:    

Similar News