తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

Rains In Telangana: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Update: 2022-07-27 06:00 GMT

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

Rains In Telangana: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఇబ్బందు కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితిపై ఎప్పటికపుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు.

తెలంగాణలో ఇవాళ, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. 13 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌కు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశామన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని తెలిపారు.

Tags:    

Similar News