వరంగల్‌ను ముంచెత్తిన వానలు

Update: 2020-08-17 09:11 GMT

Heavy rains: ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ నగరమంతా అస్తవ్యస్తంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా వర్షపునీటితో కాలనీలకు కాలనీలు నీటిలో మునిగాయి. పలుచోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఓరుగల్లు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. హన్మకొండలోని అమరావతి నగర్, నాయిమ్ నగర్ లో వరద నీరు భారీగా చేరింది. పలు ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వరంగల్‌ చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 11.74 మీటర్ల ఎత్తులో తీరం మెట్లపై నుండి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. మరోవైపు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు మండలాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండంతో.. పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. ఎజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిన్నెలవాగు, పెంకవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 6 గిరిజన గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. బయటి ప్రపంచంతో గిరిజన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వెంకటాపురంలోని పలు కాలనీల్లో 5 ఇళ్లు నేలమట్టమయ్యాయి. గుండ్ల వాగు కూడా పూర్తి స్థాయిలో నిండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లక్నవరం సరస్సులో నిర్మించిన జంట ఉయ్యాల వంతెనలు, వరద ఉధృతికి మునిగిపోయాయి. భారీ వర్షాలకు సరస్సులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నాలుగు రోజులుగా మత్తడి దూకుతోంది. 33.5 ఫీట్లకు మత్తడి పోస్తున్న సరస్సులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకుల కోసం నిర్మించిన ఉయ్యాల వంతెన ఫుట్ వే మునిగిపోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలుగా సందర్శకుల రాకపై నిషేధం కొనసాగుతోంది.


Tags:    

Similar News