Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

Heavy Rain: రహదారులపై ఉధృతంగా వరద, అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Update: 2022-09-09 02:11 GMT

Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

Heavy Rain: హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. ఏకధాటిగా గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వాన నగరవాసులను వణికించింది. గంటలకొద్దీ జనజీవనం స్తంభించిపోయింది. వరద ముంపులో చిక్కుకున్న రహదారులు చెరువులను తలపించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజీగూడ, అమీర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, బాచుపల్లి, నిజాంపేట్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు మెహదీపట్నం - మాసబ్ ట్యాంకు వరకు, మాదాపూర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మళ్లీ గురువారం మధ్యాహ్నం, ఆ తర్వాత రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం, మరో వైపు గణపతి నిమజ్జనాలు కొనసాగుతుండడంతో వరద ముంపునకు గురైన ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్‌ దారుల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పలు చోట్ల అర కిలోమీటరుకు పైగా వాహనాలు జామ్‌లో చిక్కుకుపోయాయి.

మరోవైపు, భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణానగర్‌, బోరబండ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, లంగర్‌హౌజ్‌, గోల్కొండ, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, చార్మినార్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News