సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య

*గాంధీ, అపోలో, యశోద ఆస్పత్రుల్లో పలువురికి చికిత్స *మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Update: 2022-09-13 09:45 GMT

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య

Hyderabad: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి గాంధీ, అపోలో, యశోద ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్‌ పేరిట ఉన్న ఐదంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉద్ధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మెట్లమార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది.

అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి 3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ విచారం వ్యక్తం చేశారు. సెల్లార్‌లో బ్యాటరీ బైక్‌లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగలు భవనం అంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. పొగ వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని... సెల్లార్‌లో ఎటువంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు.. కానీ యాజమాని అందుకు అనుమతించాడన్నారు. భవన యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News