పేదరికాన్ని జయించిన చదువు..

TS News: తల్లికూలీనాలీ చేసుకుని కాపురాన్ని దిద్దిన తల్లి

Update: 2023-08-08 06:30 GMT

పేదరికాన్ని జయించిన చదువు.. 

TS News: పేదరిక ఆకుంటుంబానికి అగ్ని పరీక్ష పెట్టింది. సామాన్యకుటుంబం. పుట్టిన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకోడానికి అనుకూలించని పరిస్థితులు... రెక్కాడితేగాని... డొక్కాడని పరిస్థితి. పురిట బిడ్డను ఊరుగాని ఊరు తీసుకెళ్లి... కూలీనాలీ చేసుకుని కాపాడుకుంది ఆ తల్లి. తండ్రి హోటళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. పెరుగుతున్న కొడుక్కి కష్టం తెలియకుండా పెంచారు.

అమ్మానాన్న పడిన కష్టాన్ని అంతగా తెలుసుకునే వయసుకాదు ఆబాలుడిది. అయినా... కష్టపడి చదువుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగింది. అలా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య పూర్తిచేసుకున్నాడు. పేదింటి కుర్రోడిని సరస్వతీదేవి కటాక్షించింది. తల్లిదండ్రుల కష్టాలను మరిచిపోయేలాచేసింది. పేదింట్లో ప్రతిభాకుసుమం వికసించింది. ఆతల్లిదండ్రుల కష్టం ఇపుడు వేనోళ్ల కీర్తించబడుతోంది.

ఇటీవల వెలువడిన పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ ఫలితాల్లో పెబ్బేరు క్రిష్ణారెడ్డి పేటకు చెందిన పేద కుటుంబీకుడు కిరణ్ కుమార్ విజేతగా నిలిచాడు. తమకొడుకు గౌరవప్రదమైన పోలీసు యూనిఫాం ఉద్యోగం చేయబోతున్నాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

కొడుకు పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం పొందాడని తెలుసుకున్న ఆతల్లి దండ్రులు ఆనంద పరవశులయ్యారు. బిడ్డల ఎదుగుదలకోసం శ్రమ ఫలించిందని ఆత్మసంతృప్తితో ఉన్నారు. ఆత్మవంచనలేకుండా బిడ్డలకోసం కష్టపడితే.. శ్రమ ఏనాటికీ వృధాకాదనీ, ప్రభుత్వ ఉద్యోగమే వస్తుందని కాదనీ, బిడ్డ సొంతకాళ్లపై నిలబడి జీవితాన్ని సాఫీగా సాగిస్తాడని భావించామని, ఊహించని విధంగా జీవితంలో గౌరవప్రదమైన ఉద్యోగంతో సమాజంలో తలెత్తుకు తిరిగే అవకాశం దొరికిందనే అభిప్రాయం ఆ తల్లిదండ్రుల్లో వ్యక్తమైంది.

క్రిష్ణారెడ్డిపేట కుర్రోడు కిరణ్ కుమార్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్‌ గా ఎన్నికయ్యాడని తెలుసుకున్న వివిధ కులసంఘాల పెద్దలు పూలమాలతో సత్కరించారు. కొడుకును పెంచేందుకు ఆ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుకు తెచ్చారు. పేదరికంతో ఉన్నామని కుంగిపోకుండా... పట్టుదలతో చదివిన కిరణ్ కుమార్ ప్రయోజకుడయ్యాడని వివిధ కులసంఘా ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు.

Tags:    

Similar News