Telangana: తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!!
Telangana: తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!!
Telangana: తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణాన్ని తిరిగి సవరించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగలేదని మంత్రి విమర్శించారు. అప్పటి పునర్వ్యవస్థీకరణ వల్ల పరిపాలనలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లిపోవడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వివరించారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండటం వల్ల అధికారిక పనులు చేయించుకోవడంలో ప్రజలు అయోమయంలో పడుతున్నారని తెలిపారు.
జిల్లాలు, మండలాలను సరైన ప్రమాణాలు లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని పొంగులేటి అన్నారు. అప్పటి ప్రభుత్వం సంఖ్యల మాయలో పడి, లేదా రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతాలను జిల్లా లేదా మండలాలుగా ప్రకటించిందని ఆయన ఆరోపించారు. దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోందని స్పష్టం చేశారు.
ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపై గంభీరంగా ఆలోచిస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు అవసరమైన ప్రాంతాలను కూడా గుర్తించామని చెప్పారు. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేయించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్‌లో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఈ ప్రక్రియను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, శాసనసభలో చర్చించి, అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం సుమారు 1,12,077 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. వీటిలో విస్తీర్ణ పరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతిపెద్దదిగా ఉండగా, హైదరాబాద్ జిల్లా అతి చిన్నదిగా ఉంది. రాబోయే రోజుల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్మాణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.