మహబూబాబాద్ జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్ తో నలుగురు మృతి

* మహబూబాబాద్ మండలం ఆమనగల్ ఘటన * మృతులు రెండు కుటుంబాలకు చెందిన దంపతులు

Update: 2021-01-10 02:37 GMT

representational image

విధి బలీయమైంది. అది ఎప్పుడు ఎవరితో ఆటాడుకుంటుందో తెలియదు.. కన్నుమూసి తెరిచే లోగా చాలా ఘోరాలు జరిగిపోతుంటాయి. మహబూబాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు వారిని రక్షించేందుకు ఇంకొకరు ఇలా ఒకరి వెనకాల ఒకరిని విధి బలి తీసుకుంది. మహబూబాబాద్ మండలం అమనగల్‌లో విద్యుత్ షాక్‌తో నలుగురు బలి అయ్యారు. బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటనతో రెండు కుటుంబాల పెద్దలు ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మహబూబాబాద్ జిల్లా అమనగల్లులో సత్తయ్య-రాధమ్మ దంపతులు తమ ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే పడిపోయారు. అదే సమయంలో సత్తయ్య కూతురు ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయకపోవడంతో ఎదురుగా ఉన్న లింగయ్యకు ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పింది. దాంతో లింగయ్య తన భార్య లక్ష్మితో కలిసి సత్తయ్య ఇంట్లోకి వెళ్లి చూశారు అప్పటికే సత్తయ్య దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.. దాంతో వారిని లేపే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే లింగయ్య- లక్ష్మికి కూడా విద్యుత్ షాక్ కొట్టింది. దాంతో వారు కూడా కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. తన తల్లిదండ్రులు కనిపించకపోయే సరికి లింగయ్య కొడుకు ఎదురింటికి వెళ్లి చూశాడు. అక్కడ నలుగురు పడిపోవడం చూసి కేకలు వేశాడు. దీంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చి కరెంట్ ఆఫ్ చేసి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ, వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఒక్కసారిగా రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News