Coronavirus Updates: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం.. పోలీసుల గుండెల్లో కరోనా కేసుల గుబులు

Update: 2020-07-25 07:43 GMT

Coronavirus Updates: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాకాసి కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్‌ కేసులు పోలీసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కరోనా దండయాత్రతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. కరోనా కాటుకు ఇప్పటికే ఒక ఏఎస్సై బలవగా పలువురు కానిస్టేబుల్స్‌, ఇతర ఉద్యోగులు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది.

రాకాసి కరోనా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను వణికిస్తోంది. ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రజలను అప్రమత్తం చేస్తోన్న పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు పెద్దఎత్తున వైరస్ బారిన పడుతుండటంతో ఖాకీల్లో కలవరం మొదలైంది. కరోనా కాటుకు ఆదిలాబాద్‌ వన్ టౌన్ ఏఎస్సై ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు వణికిపోతున్నారు. అలాగే, కుమ్రంభీమ్ జిల్లాలో పలువురు కానిస్టేబుల్స్‌‌కు కరోనా సోకడంతో వందల మంది కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇక, ఆదిలాబాద్‌ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ముగ్గురికి కరోనా సోకింది. ఇందులో ఇద్దరు సీసీలు, ఒక ఓఎస్డీ ఉన్నారు. దాంతో, ఈ ముగ్గురి కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌తోపాటు వంద మందికి ఇప్పటివరకు కోవిడ్ టెస్టులు చేశారు. ఇలా, కరోనా భూతం పోలీసులపై దండయాత్ర చేస్తుండటంతో ఖాకీల్లోనూ, వాళ్ల కుటుంబాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది.

మరోవైపు, మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై ఆఫీసులో ఇద్దరికి కరోనా నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని మూసివేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులు భయపడుతున్నారు. ఆఫీసులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రెవెన్యూ అధికారులైతే ప్రజలను కార్యాలయాలకు రావొద్దంటూ ఏకంగా బోర్డులే పెట్టారు. ఏమైనా సమస్యలుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంమీద పెరుగుతున్న కరోనా కేసులు పోలీసుల్లోనూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.

Tags:    

Similar News