తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. 55కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
Telangana: 90 శాతం కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు
తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. 55కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
Telangana: ప్రపంచ వ్యాప్తంగా లక్షల ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. కొత్త రూపం సంతరించుకుని మళ్లీ ఆందోళనను కలిగిస్తోంది. భారత్‌లో జేఎన్-1 వేరియంట్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55కి చేరింది.
తెలంగాణలో నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసుల్లో 90 శాతం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే వెలుగుచూస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్‌కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు.
అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా రాబోయే పది రోజులు కీలమంటున్నారు వైద్యులు. డిసెంబర్‌లో కరోనా కేసుల సంఖ్య పెరగడం సహజమే అంటోన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న జ్వరం, జలుబు, దగ్గు కేసులతో జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉందన్నారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తోన్న నేపథ్యంలో పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.