హుజూర్ నగర్ రేసుకు గుర్రాలు రెడీ..అభ్యర్థులను ప్రకటించిన పెద్ద పార్టీలు

Update: 2019-09-24 12:27 GMT

హుజూర్‌నగర్‌ వార్‌కు రెడీ అవుతున్నాయి పొలిటికల్‌ పార్టీలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తుండటంతో పాటు సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికల వాతావరణం రావడంతో పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. సిట్టింగ్‌ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతుండగా, ప్రభుత్వానికి బూస్ట్‌ ఇచ్చేలా ప్రతిపక్ష స్థానాన్ని సాధించుకోవాలనే పట్టదలతో అధికార టీఆర్ఎస్ ఉంది. తామేం తక్కువ తినలేదంటూ మధ్యలో బీజేపీ కూడా పావులు కదుపుతోంది. అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమైంది.

మరోవైపు కాంగ్రస్‌లో హుజూర్‌నగర్‌ ఉత్కంఠ వీడింది. బరిలో నిలిచే అభ్యర్థిని హైకమాండ్‌ ప్రకటించింది. ఉత్తమ్‌ భార్యకే అధిష్టానం ఓటేసింది. పద్మావతిరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా హుజూర్‌నగర్‌లో ఎవరు నిలుస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. తొలుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన భార్య పద్మావతిరెడ్డి పేరును ప్రకటించారు. అయితే దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. పద్మావతి అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే విభేదించారు. అంతేకాకుండా.. కిరణ్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేవంత్‌ను సీనియర్లు బాహాటంగానే విమర్శించారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి.. ఇలా తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో హుజూర్‌నగర్‌ బరిలో నిల్చేదెవరనేదానిపై ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఉత్తమ్‌ నిర్ణయానికే జై కొట్టారు.

ఇటు హుజూర్‌నగర్‌ విషయంలో అధికార టీఆర్ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు. ఎన్నికల తేదీని ప్రకటించిన నిమిషాల్లోనే అభ్యర్థిని ఖరారు చేశారు. సీనియర్‌ నాయకులు, జిల్లాకు చెందిన మంత్రితో సమాలోచనలు చేసిన కేసీఆర్‌ ఉత్తమ్‌ చేతిలో ఓటమి చవిచూసిన సైదిరెడ్డికే ఓటేశారు. సైదిరెడ్డి పేరును ప్రకటించారు. ఇక హుజూర్‌నగర్‌ రేసులో బీజేపీ కూడా దూసుకుపోతోంది. శ్రీకళారెడ్డి పేరును ప్రకటించేందుకు సిద్ధమైంది. ఒకటిరెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News