Congress: తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ హైకమాండ్
Congress: టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీఠ వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
Congress: తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ హైకమాండ్
Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక సమీపిస్తుండటంతో గెలుపు వ్యూహాలను రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పెద్దలు అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగే భారీ బహిరంగ సభలో ఈ మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీలో, బయట చర్చ జరుగుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో అవే వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదే సంప్రదాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. తెలంగాణాలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లుండగా ఇందులో 30 స్థానాలు రిజర్వుడ్ కేటగిరీ సామాజిక వర్గాలకు ఖరారు చేశారు. ఇవి పోను మిగిలిన 80కి పైగా ఉన్న జనరల్ స్థానాల్లో ఎక్కువ సీట్లను వెనుకబడిన తరగతులకు కేటాయించి వారిని రంగంలోకి దించాలని పార్టీ అధినాయకత్వం వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలా అని అగ్రవర్ణాల వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచకుండా బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఎక్కువ స్థానాల్లో ఈ వర్గాల వారికి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనకు వచ్చినట్టు సమాచారం.
తెలంగాణలో ఏఏ నియోజకవర్గాలలో ఏ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఉంది. అందులో ఆ సామాజిక వర్గ ఓటర్లు ఎంతమంది ఉన్నారు..? 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు పోటీ చేసే అవకాశం కల్పించింది. గెలిచిన నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య ఎంత అన్న సమాచారాన్ని తెప్పించుకుని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై ఏఐసీసీ వర్గాలు ఒక సమగ్ర నివేదిక సిద్దం చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలకు అందజేసినట్టు చెబుతున్నారు.
ఎన్నికల్లో గెలిచి భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ఏర్పాటులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్న సంకేతాలను ఎన్నికల ప్రణాళికతో పాటు ప్రజలకు ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నట్టు రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే కాకుండా అన్ని నామినేటెడ్ పదవుల్లో మహిళలతో సహా అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తామన్న భరోసాను ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు హస్తం వర్గాల్లో చర్చ జరుగుతోంది.