Revanth Reddy: పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: అధికారుల బదిలీలు చేపట్టనున్న రేవంత్‌రెడ్డి

Update: 2023-12-12 06:24 GMT

Revanth Reddy: పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీకి కసరత్తు జరుగుతోంది. చురుగ్గా నిర్ణయాలు తీసుకుని సమర్ధవంతంగా, పారదర్శకంగా పని చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన అధికారులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు వీలుగా కూడా ఈ బదిలీలు, నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. అధికారుల గత చరిత్ర, పారదర్శకత, సమర్ధతలే ప్రామాణికంగా బదిలీలు, నియామకాలు ఉండేట్టు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలోనే ఈ కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్‌ల బదిలీలపైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృతస్థాయిలో కసరత్తు చేపట్టారు. అధికారుల జాబితాలను తెప్పించుకున్నారు. వారు ఎక్కడెక్కడ, ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు? పనితీరు ఎలా ఉంది? సమర్థత, అభియోగాలు, ఇతర అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాటు ఇతర వర్గాల ద్వారా కూడా వివరాలు తెప్పించుకున్నారని సమాచారం. వాటి ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపట్టబోతున్నారని తెలుస్తోంది.

అయితే ప్రభుత్వం మాత్రం పైరవీల కంటే పనితీరుకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే పోలీస్‌ శాఖ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు ఉండవచ్చని సమాచారం. ఆ తర్వాత మరో రెండు దఫాల్లో బదిలీలన్నీ పూర్తి చేయనున్నారు.

Tags:    

Similar News