ఆ రెండు జిల్లాలపై సీఎం స్పెషల్ ఫోకస్

Cm Kcr Review On Heavy Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Update: 2020-08-15 11:21 GMT
Cm Kcr File photo

Cm Kcr Review On Heavy Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని చెరువులు, కాలువలు అన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వరద నీరు రహదారులపైకి చేరుకుని రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వర్షాలు, వరదల పరిస్థితిపై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. రాష్ట్రంలోని చాలా చెరువులు పూర్తి స్థాయి నీటిమట్టం పెరిగిందని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను తెలుసుకునేందుకు హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అన్ని జిల్లాలకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని, అధిక వర్షపాతం నమోదు కావడంతో సుమారు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. వరంగల్, కరీంనగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అంతే కాక లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం రెండు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. దీంతో అప్రమత్తమయిన అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండు హెలికాఫ్టర్లను అందుబాటులోకి ఉంచారు. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాఫ్టర్ తో పాటు సైనిక హెలికాఫ్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది.

Tags:    

Similar News