Medak Church: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ జన్మదిన వేడుకలు

Medak Church: ఉదయం 4 గంటల ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

Update: 2022-12-25 00:56 GMT

Medak Church: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ జన్మదిన వేడుకలు

Medak Church: మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఉదయం 4 గంటలకు ప్రార్థనలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఏసు క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా శిలువను ఊరేగింపుగా తీపుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సాల్మన్ రాజు దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సెకండ్ సర్వీస్ అయిన తర్వాత ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చిలో ఏసుక్రీస్తు దర్శనానికి అనుమతిస్తారు. అయితే రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచే ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది గురువులు అందుబాటులో ఉంటారని చర్చి ప్రెసిబిటరీ ఇంచార్జి జార్జి ఎబానైజర్ రాజు తెలిపారు. చర్చికి వచ్చే భక్తులకు వసతి, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు.

చర్చి ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలు తిలకించేందుకు తరలివచ్చారు.

పూర్తిగా రాతితో నిర్మింపబడి ఎత్తయిన చర్చి మెయిన్ టవర్, కమాన్‌లను, చర్చి ప్రాంగణాన్ని కలర్‌ఫుల్‌గా అలంకరించారు. చర్చిలో బిషప్, గురువులు కూర్చుండే ప్రధాన వేదికను మెయిన్ హాలును అందంగా అలంకరించారు. భారీ సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. క్రీస్తు వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News