Telangana: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఫోకస్

Telangana: పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ అనుసంధానంపై సమీక్ష

Update: 2021-03-25 02:41 GMT
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల విస్తరణపై ఫోకస్ పెంచారు. పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతలను జూరాలతో అనుసంధానం చేసే అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు సీఎం. ఇరిగేషన్ శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

ప్రతీ కింది స్థాయి ఇంజినీర్‌కు ఇరిగేషన్‌పై కమాండింగ్ రావాల్సిన అవసరముందన్నారు. పంపులు మోటార్లు ఒక భాగంగా గేట్లు ప్రాజెక్టులు, గేట్లు కాల్వలు మరో భాగంగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి నిధులను కేటాయించుకుందామని తెలిపారు.

పాలమూరు ఎత్తిపోతలను కల్వకుర్తి జూరాలకు అనుసంధానం చేసే కార్యాచరణకు సంబంధించి కసరత్తు జరిపిన సీఎం పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లు, కాల్వలను నిర్మించాల్సిన ఎత్తు, అందుకు సంబంధించిన కాంటూర్ పాయింట్లను గుర్తించారు. అత్యధిక ఎకరాలకు గ్రావిటీద్వారా నీటిని తరలించే విధానాలను చర్చించారు. పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల అనుసంధానంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగు,తాగునీరందించేలా సూచనలు చేశారు.

కరివెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తరలించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల రూట్లను గుర్తించారు. ఉద్దండాపూర్ నుంచి కొడంగల్, నారాయణపేట్, తాండూర్, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజక వర్గాలకు సాగునీరందించే కాల్వల రూట్లపై అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలు పారే విధంగా కాల్వల ఎత్తును నిర్దారించుకోవాలన్నారు. టన్నెల్ నిర్మాణాలను తగ్గించి ఓపెన్ కెనాల్ లను తవ్వాలని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే సాంకేతికతను లోతుగా పరిశీలించాలని ఆదేశించారు. ఆర్డీఎస్ స్కీం పనుల పురోగతిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్ ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని సాధించుకుందామన్నారు.

Tags:    

Similar News