ఎండల కంటే వేడెక్కిన చికెన్‌ ధరలు

Chicken Rate: *రూ.300కు చేరిన కిలో చికెన్‌ *కిలో బోన్‌లెస్‌ ధర రూ.450

Update: 2022-03-13 16:00 GMT

ఎండల కంటే వేడెక్కిన చికెన్‌ ధరలు

Chicken Rate: కోడి ధరలు కొండెక్కాయి. చికెన్ తినాలనుకునే వారికి చుక్కలు చూపెడుతున్నాయి. ఓ వైపు కూరగాయలు, వంట నూనెల ధరలు పెరుగుతుంటే.. తాను మాత్రం తక్కువా? అన్నట్టుగా చికెన్‌ ధరలు భారీగా దూసుకెళ్తున్నాయి. తాజాగా కిలో చికెన్‌ ధర 300 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు.

కొన్నిరోజుల క్రితం కంది పప్పు కంటే చికెన్‌ ధరే తక్కువగా ఉండేది. రెండు కిలోల చికెన్‌ ధర అర కిలో మటన్‌తో సమానం. మటన్‌తో పోలిస్తే చికెన్‌ చౌక కావడంతో తినేందుకు మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మక్కువ చూపేవారు. ఆదివారం వచ్చిదంటే చాలు ఇళ్లలో చికెన్‌ గుమగుమలు వెలువడేవి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆదివారం ఒక్కరోజులో 8 లక్షల కిలోల చికెన్‌ విక్రయమవుతుంది. ఇక సాధారణ రోజుల్లో 4లక్షల కిలోల చికెన్‌ అమ్ముతున్నట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్‌ ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఎండల కంటే ముందే చికెన్‌ ధర మండుతోంది. రెండు వారాల్లో 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగింది.

వేసవి నేపథ్యంలో చికెన్ ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ 290 రూపాయలు పలుకుతోంది. బోన్‌లెస్‌ చికెన్ ధర కిలో 450 రూపాయలు పలుకుతోంది. చికెన్ కొనేందుకు వచ్చిన వినియోగదారులు, రేట్ల పట్టిక చూసి బెదిరిపోతున్నారు. చికెన్‌ ధరలను చూసి కొనుగోలు చేయకుండానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. కిలో చికెన్ ధరకు అర కిలో మటన్ వస్తుండడంతో పలువురు మటనే బెటర్‌ కదా అంటున్నారు. చికెన్‌ ధరలు పెరగడంతో వ్యాపారాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 200 కిలోల చికెన్ విక్రయించేవారమని.. ఇప్పుడు 80 కేజీలు కూడా అమ్మలేకపోతున్నామని వాపోతున్నారు.

వేసవిలో వేడిని తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ ఫామ్‌లను యాజమానులు మూసివేస్తున్నారు. కోళ్ల సంరక్షణకు అధికంగా వచ్చించాల్సి వస్తోందని.. దాని కంటే పౌల్ట్రీని మూసివేయడమే మేలని యజమానులు చెబుతున్నారు. ఫలితంగా చికెన్‌ ధరలు మరింత పెరుగుతున్నాయి.

Tags:    

Similar News