Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో శనగ రైతుల గోస

Adilabad: పండిన పంట అమ్మేందుకు నానా తంటాలు

Update: 2022-04-18 08:58 GMT

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో శనగ రైతుల గోస

Adilabad: ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో శనగ రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. రబీ సీజన్‌లో పండిన పంట చేతికి వచ్చిందనే సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పండిన పంట అమ్మేందుకు నానా తంటాలు పడుతున్నారు. పంటను తీసుకొని మార్కెట్ యార్డుకి వస్తే కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా లేరని రైతులు వాపోతున్నారు. దీంతో పంటతో పాటు రైతులు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుందని కలవరానికి గురవుతున్నారు.

మరోవైపు శనగ కొనుగోళ్ల విషయంలో అధికారులు రకరకాల ప్రకటనలు చేయడంతో రైతులు మరింత అయోమయానికి గురవుతున్నారు. ఒకరు గోనె సంచుల కొరత వల్ల శనగ కొనుగోలు నిలిచిపోయిందంటుంటే మరొకరు వాటికి క్యూఆర్ కోడ్స్ రాకపోవడంతో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరొకరు వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ తెలపడంతోనే కొనుగోళ్లు నిలిచిపోయాయనడం అయోమయానికి గురి చేస్తుందంటున్నారు.

ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 83 ఎకరాల్లో శనగ పంట సాగయ్యింది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే అంచనాకు మించి దిగుబడి రావడంతో కొనుగోళ్ల విషయంలో సమస్యలు తలెత్తాయంటున్నారు అధికారులు. నిజానికి జిల్లాలో లక్ష యాభై వేల క్వింటాళ్ల శనగ కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉండడంతో ఇప్పటికే టార్గెట్ రీచ్ అయ్యామని చెబుతున్నారు. అయితే రాష్ట్రం మొత్తానికి కేటాయించిన అనుమతుల మేరకు ఇతర జిల్లాల్లో మిగులు ఉంటె దాన్ని సర్దుబాటు చేసి ఇక్కడి రైతుల నుండి కొనుగోలు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ అనుమతితో మిగిలిన శనగలు కొనుగోలు చేస్తామని ఓ వైపు అధికారులు చెబుతుంటే ఇంకెప్పుడు కొంటారంటూ రైతులు మరోవైపు ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలుపై ఓ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News