పిల్లలు, పెద్దలతో కళకళలాడుతున్న పుస్తక ప్రదర్శన

హైదరాబాద్‌లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన రెండో రోజు శనివారం కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల పండుగకు యువత, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు భారీగా తరలివచ్చారు.

Update: 2025-12-21 06:16 GMT

హైదరాబాద్: హైదరాబాద్‌లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన రెండో రోజు శనివారం కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల పండుగకు యువత, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు భారీగా తరలివచ్చారు. మొత్తం 365 స్టాళ్లతో కొలువుదీరిన ఈ ప్రదర్శనలో కథలు, నవలలు, పోటీ పరీక్షల పుస్తకాలపై 10-20% ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు.

'డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివేదెవరు?' అన్న ప్రశ్నకు దీటైన సమాదానంగా ఈ పుస్తకాల పండుగ జరుగుతోంది. పిల్లలు పుస్తక పఠనానికి దూరమయ్యారన్న బెంగను చెరిపేసింది. చిన్నారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు విహారయాత్రలా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు వస్తున్నారు. వివిధ రకాల పుస్తకాలు కొంటున్నారు. 'పుస్తకం చదవకుండా రోజు గడవదని' కొంతమంది చిన్నారుల సమాధానమే పుస్తకానికి ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం. రెండో రోజు కూడా పుస్తక ప్రదర్శనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

చాలా మంది పుస్తక ప్రియలు తమ మిత్రులను కూడా ఈ ప్రదర్శనలో కలుసుకుని ఆనందించారు. ఎప్పటినుంచో వెతుకుతున్న పుస్తకం చేతికి చిక్కితే ఆ మజాయే వేరు. మరికొంత మంది అలాంటి మజా పొందారు. మొత్తంగా చూస్తే, పుస్తక పరిశ్రమలోకి కొత్త రచయితలూ, కొత్త పబ్లిషర్లూ, కొత్త పాఠకులూ వచ్చారు. ఇది తెలుగు పుస్తకాలకు నిజమైన సంక్రాంతి. ప్రముఖ రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలతో ప్రాంగణం కళకళలాడుతోంది. విద్యార్థులకు ఐడీ కార్డు చూపిస్తే ప్రవేశం ఉచితంగా కల్పించారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 29 వరకు కొనసాగుతుంది.

Tags:    

Similar News