తెలంగాణలో ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్
BJP: ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారం
తెలంగాణలో ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్
BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్‌రెడ్డే కొనసాగనున్నారా? పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చితే.. లాభం కన్నా నష్టమే ఎక్కువని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష మార్పునకు దూరంగా ఉండాలని జాతీయ నాయకత్వం యోచిస్తుందట. పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీలో చర్చ జరుగుతోందట. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ సమయంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఇబ్బందులు తప్పవని.. కుదురుకోవడానికి సమయం పడుతుందని భావించి కిషన్ రెడ్డినే కొనసాగించాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే కిషన్‌రెడ్డి సారథ్యంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లేయోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందని టాక్. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధత కావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతుంది
గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి కనీసం పదికి తగ్గకుండా ఎంపీ స్థానాల్లో గెలుపొందాలని కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్. అయితే ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఎలాంటి అస్త్రాలను సంధించాలనే వ్యూహాలపైనా కాషాయ పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్డు, రైల్వే, రోడ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లాని భావిస్తోందట. దీనికోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు చెబుతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట జనాలలోకి చేరువ కావాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలో జనవరి 26 వరకు వికసిత్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందకపోతే వారిని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో నమోదు చేయించి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించనున్నారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో చర్చ జరిగే విధంగా బీజేపీ యోచన చేస్తోంది.
మరో వైపు తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్యపోరుకు చెక్ పెట్టడంపైనా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ఆధిపత్య పోరుకు తెరపడేలా సౌమ్యుడిగా ముద్రపడిన కిషన్ రెడ్డినే కొనసాగించాలని జాతీయ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సౌత్ ఇండియా అయిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం సౌత్‌లో ఎక్కువ మొత్తంలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంపై ప్రణాళికలు రచించనున్నట్లు సమాచారం. దక్షిణాదిలో కాంగ్రెస్‌కు సవాల్ విసరాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితం కావడంతో మరోసారి అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గెలుపు గుర్రాలకే పార్లమెంట్ టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది. మరి హైకమాండ్ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయనే చర్చ జరిగింది. ఇదే తరుణంలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని తొలగిస్తే కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జాతీయ నాయకత్వం భావిస్తుందట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో చేయకుండా సీనియర్ నేత అయిన కిషన్‌రెడ్డి సారథ్యంలోనే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి సత్తా చాటాలని చూస్తుందట. మరి జాతీయ నాయకత్వం అంచనాలకు తగ్గ ఫలితాలు వస్తాయో రావో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.