పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పద్మ పురస్కారాలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు.

Update: 2025-01-27 11:56 GMT

పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: పద్మ పురస్కారాలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని.. అర్హులకు మాత్రమే అవార్డులు ప్రధానం చేస్తుందన్నారు. ఇదే సమయంలో గద్దర్ పేరును ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తామన్నారు? ఆయన భావజాలం ఏంటి? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామన్నారు? మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం.. బరాబర్ ఇవ్వం" అని బండి సంజయ్ అన్నారు.

అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తెలంగాణ సర్కార్ అమలు చేయాలని చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు.

కేంద్రం గత పదకొండేళ్లల్లో తెలంగాణ అభివృద్ధి కోసం 12 లక్షల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా? అంటూ ఫైరయ్యారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమని.. కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం అని.. కానీ కేంద్ర పథకాలకు పేర్లు మార్చితే ఊరుకునేది లేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఆ జాబితాలో ఏపీ నుంచి ఐదుగురికి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు దక్కింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి కేవలం రెండు పద్మ అవార్డులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వైఖరిని నిలదీశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఇదే విషయమై ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. అయితే తాజాగా ఈ అంశంపై మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్, ఇటు గద్దర్ అభిమానుల ఏ విధంగా స్పందిస్తారే చూడాలి మరి.

Tags:    

Similar News