Bandi Sanjay: మీరు నన్ను గెలికారు...ఇకపై తెలంగాణ అంతా తిరుగుతా
Bandi Sanjay: వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోతే చుక్కలు చూపిస్తా
Bandi Sanjay: మీరు నన్ను గెలికారు...ఇకపై తెలంగాణ అంతా తిరుగుతా
Bandi Sanjay: కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నువ్వానేనా అంటూ బండి, పొన్నం.... కౌంటర్లు, సవాళ్లతో విరుచుకుపడుతున్నారు. రోజుకో కామెంట్‌తో ఇద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పార్లమెంట్‌లో గెలుపు నుంచి అయోధ్యకు టర్న్ అయిన ఇద్దరి వ్యాఖ్యలు.. తల్లిని అవమానిస్తున్నారంటూ ఒకరినొకరు వాదులాడుకునే స్థాయికి చేరింది. దీంతో ఎన్నికల ప్రచారవేడి మొదలవకముందే.. కరీంనగర్‌లో కాంట్రవర్శియల్ కామెంట్ల కాక రేగింది. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని, తానే దగ్గరుండి గెలిపిస్తానని మంత్రి పొన్నం అన్నారు. బండి సంజయ్‌ను ఓడగొడతానని పొన్నం సవాల్ విసిరారు.
బండి సంజయ్ పొన్నంకు ప్రతి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నువ్వు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్ధి నా మీద ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని బండి సంజయ్ ప్రతిసవాల్ చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. అయోధ్య రాముడి జన్మస్థలం గురించి పొన్నం చేసిన కామెంట్లపై బండి సంజయ్ స్పందించడంతో వివాదం మొదలైంది.
అయోధ్య విషయంలో మంత్రి పొన్నంపై బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సంజయ్ ఫ్లెక్సీలను చించివేశారు. ప్రజాహిత యాత్రలో కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావని పొన్నంను ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆయనపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు. రాముడి జన్మంపై నేను ఎప్పుడు మాట్లాడ లేదని, నేనని మాటను నాకు ఆపాదిస్తూ తల్లి జన్మపై మాట్లాడటం దుర్మార్గమన్నారు. తల్లి ఎవరికైనా తల్లేనని అలాంటి మాటలు తప్పు అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే తనపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్ల దాడి చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. రాముడి జన్మస్థలాన్ని ప్రశ్నించే వాళ్లను నేను నిలదీస్తే... తల్లిని అడ్డుపెట్టుకుని ఇక్కడున్న మంత్రి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు. మంత్రి విజ్ఝతకే వదిలేస్తున్నానని ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.