అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన ఇద్దరు లాయర్ల వాదనలు

Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన ఇద్దరు లాయర్ల వాదనలు

Update: 2023-05-27 04:15 GMT

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన ఇద్దరు లాయర్ల వాదనలు 

Avinash Reddy:  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వాడీ వేడిగా జరిగాయి. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది 5 గంటల పాటు, వైఎస్ సునీత తరపు లాయర్ గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇవాళ సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. నేడు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సీబీఐ వాదనలు వింటామని హైకోర్ట్ పేర్కొంది.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఎదుట అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఉమా మహేశ్వరరావు తన వాదనలు వినిపించారు. అనంతరం ఎంత సమయం కావాలని సునీత, సీబీఐ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో చెరో గంట కావాలని వారు కోరారు. అలా అయితే ఈరోజే విచారణ ముగుస్తుందని లేకుంటే వేసవి సెలవుల అనంతరం వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో అవినాష్ రెడ్డి, సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను పూర్తి చేశారు.

వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇరికించేలా కుట్ర జరుగుతోందని ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి వివేకాతో భూవివాదాలు ఉన్నాయని తెలిపారు. అలాగే నిందితుల్లో మరో ఇద్దరు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌లతో వివేకాకు విభేదాలు తలెత్తాయని, వజ్రాల వ్యాపారం చేస్తామంటూ వాళ్లిద్దరూ వివేకాను మోసగించడంతో సంబంధాలు చెడిపోయాయని తెలిపారు. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వివేకానందరెడ్డి తలదూర్చడంతో వారిద్దరికి వివేకాపై కోపం ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిందితుడని ఎక్కడా చెప్పలేదన్నారు.

వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదని లాయర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. CBI దాఖలు చేసిన రెండు ఛార్జ్ షీట్లలో అవినాష్ రెడ్డి నిందితుడని పేర్కొనలేదన్నారు. రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసే వరకు కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏడాది తర్వాత ONE SIXTY (160) కింద నోటీసులు ఇచ్చారని లాయర్ తెలిపారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు తన క్లయింట్ హాజరయ్యారని, ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని ఉమా మహేశ్వరరావు కోరారు ఆ వెంటనే సునీత తరపు న్యాయవాది ఎల్. రవిచందర్ తన వాదనలు వినిపించారు.

విచారణకు హాజరు కావాలని సీబీఐ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి ఏదో ఒకటి చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సునీత తరపు లాయర్ తాజాగా తల్లి అనారోగ్యంతో ఉన్నారని అంటున్నారని కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని రవిచందర్ వాదించారు. అంతేకాకుండా కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ మద్దతుదారులు ధర్నాలు చేస్తున్న ఫొటోలను కోర్టుకు సమర్పించారు సునీత తరపు లాయర్ రవిచందర్... ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ ఉదయం సీబీఐ తరపున వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేసింది...

Tags:    

Similar News