Adilabad: జాతీయ రహదారి పై టమాటా లారీ బోల్తా.. టమోటాలు ఎత్తుకెళ్లకుండా భద్రత కల్పించిన పోలీసులు
Adilabad: లారీలో 22 లక్షల టమోటాలు ఉన్నాయన్న పోలీసులు
Adilabad: జాతీయ రహదారిపై టమాటా లారీ బోల్తా.. టమోటాలు ఎత్తుకెళ్లకుండా భద్రత కల్పించిన పోలీసులు
Adilabad: ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని జాతీయ రహదారిపై ఓ టమాటాల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గంపలు, బస్తాలతో పెద్ద సంఖ్యలో పరుగెత్తుకు వచ్చారు. కానీ ఆ లోపే సమాచారం అందడంతో పోలీసులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. లారీలో 18 టన్నుల టమాటాలున్నాయి. లారీ బోల్తా పడటంతో బాక్సుల్లోంచి టమాటాలు నేలమీద చెల్లాచెదురుగా పడ్డాయి.
టమాటాలు చెల్లాచెదురుగా పడటం, సరుకు దోపీడీ జరిగే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన డ్రైవర్, పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి టమాటలను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో తరలిస్తున్న టమాటల విలువ 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో స్థానికులు ఎత్తుకెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. తండోపతండాలుగా అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులను చూసి నిరాశగా వెనుదిరిగారు. పోలీసులు మరో వాహనాన్ని ఏర్పాటు చేయించి టమాటలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు రాష్ట్రంలో టమాటా ధరలు ఏమాత్రం తగ్గట్లేదు. వికారాబాద్ జిల్లాలో టమాటా ధర డబుల్ సెంచరీ కొట్టింది.
టమాటా ధరలు పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టమాటాలు విరివిగా లభిస్తున్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి నాఫెడ్ ద్వారా టమాటాలను కొనుగోలు చేసి ఢిల్లీ సహా పలు నగరాలకు సరఫరా చేస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకు టమాటాలను అందించే ఏర్పాట్లు చేసింది.