Telangana Budget 2025-26: ప్రతి ఏటా 30 వేల ఉద్యోగాలు
Telangana Budget 2025-26: ప్రతి ఏటా 30 వేల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Telangana Budget 2025-26: ప్రతి ఏటా 30 వేల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క బుధవారం ప్రవేశపెట్టారు.హైదరాబాద్ సమీపంలోని ముచ్చర్లలో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ఈ యూనివర్శిటీలో విద్యార్థులకు బోధిస్తారు. యువతకు, ఇటు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉండేలా కోర్సులను రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఐదు కోర్సులను ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో యానిమేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రిటైల్ రంగం, మీడియా, సినిమారంగం, నౌక, విమాన మెయింటెనెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి అత్యాధునిక కోర్సులను కూడా ప్రారంభించనున్నారు.
200 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో ఎఐ సిటీ
తెలంగాణ యువత, విద్యార్థుల కోసం ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఎఐ సిటీని నెలకొల్పనున్నారు. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సౌకర్యాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2023 జులై -సెప్టెంబర్ కాలంలో తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉండగా, 2024 జులై-సెప్టెంబర్ నాటికి ఇది 18.1 శాతానికి తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది.