AC Buying Tips: ఎయిర్ కండిషనర్ (ఏసీ) కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు..!

AC Buying Tips: స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ వేగంగా గదిని చల్లగా మార్చేస్తాయి. కానీ, వాటిని ఇన్‌స్టాల్ చేయడానికి కాస్త ఎక్కువ ఖర్చవుతుంది.

Update: 2024-05-06 09:02 GMT

AC Buying Tips: ఎయిర్ కండిషనర్ (ఏసీ) కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు..!

AC Buying Tips: స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ వేగంగా గదిని చల్లగా మార్చేస్తాయి. కానీ, వాటిని ఇన్‌స్టాల్ చేయడానికి కాస్త ఎక్కువ ఖర్చవుతుంది. ఇల్లు మారాలన్నా కూడా వీటితో ఇబ్బంది. దీనితో పోల్చితే విండో ఏసీని సులభంగా అమర్చుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువే. కానీ, విండో ఏసీలకు స్ప్లిట్ ఏసీలతో పోల్చితే ఎక్కువ కరెంటు ఖర్చవుతుంది. ఇలాంటి చాలా విషయాలు మనం ఏసీ కొనేముందు దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి 5 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. విండో ఏసీ మంచిదా, స్ప్లిట్ ఏసీ బెటరా?

మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే విండో ఏసీ కొనుక్కోవడమే మంచిది. దీన్ని సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ‌సులభంగా మరో చోటుకు తీసుకుపోవచ్చు. అయితే, ఇవి అంత అందంగా కనిపించవు. చప్పుడు కూడా ఎక్కువే చేస్తాయి. అంతేకాదు, మరీ విశాలమైన గదులకు ఇవి కరెక్ట్ కాదు. కానీ, తక్కువ ఖర్చుతో అద్దె ఇంట్లో పెట్టుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతారు. ఇక, మీది సొంత ఇల్లు అయితే తప్పకుండా స్ప్లిట్ ఏసీకే వెళ్ళండి. ఇది గదిలో అందంగా ఉంటుంది. చల్లగాలిని వేగంగా ప్రసారం చేస్తుంది. చప్పుడు తక్కువ. కరెంటు ఖర్చు కూడా తక్కువే. ఈ రెండూ కాకుండా మరో ఆప్షన్ కూడా ఉంది. అదే పోర్టబుల్ ఏసీ. ఇదీ విండో ఏసీలాంటిదే. కానీ, ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలోకి తీసుకుపోవచ్చు. హాల్లో ఉన్నప్పుడు హాల్లో, బెడ్రూంలో ఉన్న బెడ్రూంలో దీన్ని వాడుకోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్న చిన్న ఫ్యామిలీ దీన్ని ఎంచుకోవచ్చు. అయితే, దీని ధర ఎక్కువ. చప్పుడు కూడా ఎక్కువే. పైగా, విశాలమైన గదులకు ఇది అంతగా ఉపయోగపడదు.

2. ఏసీ కెపాసిటీ ఎంత ఉండాలి?

మీ గదికి సరైన ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిజానికి, చిన్న బెడ్ రూమ్‌కు ఒక టన్ ఏసీ సరిపోతుంది. గది విస్తీర్ణం 180 చదరపు అడుగులు అంటే 12x15 అడుగుల కన్నా ఎక్కువ ఉంటే 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. 250 చదరపు అడుగుల గదికి 2 టన్నులు, 350 చదరపు అడుగులు దాటితే 3 టన్నుల ఏసీలు అవసరమవుతాయి. చిన్న గది కోసం ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీని తీసుకుంటే మీరు అనవసరంగా కరెంట్ మీద ఖర్చు చేస్తున్నారన్న మాటే.

3. స్టార్ రేటింగ్ అంటే ఏంటి?

ఒక ఏసీకి 5 స్టార్స్ ఉంటే అది తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ వేగంగా గదిని చల్లబరుస్తుందని అర్థం. తక్కువ ఎనర్జీని ఉపయోగిస్తుంది కాబట్టి, అది పర్యావరణానికి మంచిది. 3 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీతో 28% విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతారు.

అయితే, స్టార్ రేటింగ్స్‌ను ఒకే రకం ఏసీలతో పోల్చి చూడాలి. స్ప్లిట్ ఏసీ, విండో ఏసీలకు 5 స్టార్ ఉంటే రెండూ ఒకటే అనుకోవద్దు. 5 స్టార్ విండో ఏసీ కన్నా 3 స్టార్ స్ప్లిట్ ఏసీ తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. అయితే, 3 స్టార్ ఏసీకి, 5 స్టార్ ఏసీకి మధ్య ధరలో ఎక్కువ తేడా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధర ఎంత తగ్గుతుంది. కరెంట్ ఖర్చు ఎంత తగ్గుతుందన్న లెక్క చూసుకుని తగిన ఏసీని ఎంచుకోవాలి. 3 స్టార్ ఏసీ కన్నా 10-15 శాతం ఎక్కువ ధరకు 5 స్టార్ ఏసీ లభిస్తే అదే మంచిది. వేడి వాతావరణంలో ఉంటున్న వాళ్ళు, రోజులో ఎక్కువ గంటలు ఏసీ వాడాల్సిన అవసరం ఉన్నవాళ్ళు 5 స్టార్ ఏసీ ఎంచుకోవడమే ఉత్తమం.

4. ఇన్వర్టర్, నాన్-ఇన్వర్టర్ ఏసీల మధ్య తేడా ఏంటి?

ఇన్వర్టర్, నాన్-ఇన్వర్టర్ ఏసీలలో టెక్నాలజీ వేరు వేరుగా ఉటుంది. ఇన్వర్టర్ ఏసీలకు కరెంటు ఖర్చు తక్కువ ఉంటుంది. అందుకే వీటి ధర ఎక్కువ. ఇన్వర్టర్ ఏసీలకు పవర్ ఇన్వర్టర్ బ్యాకప్ తప్పనిసరిగా ఉండాలన్నది కేవలం అపోహ మాత్రమే. ఇన్వర్టర్ అన్నది ఏసీలో పవర్ వినియోగాన్ని తగ్గించే టెక్నాలజీ. దానికి, పవర్ బ్యాకప్‌తో పని లేదు. ఈ టెక్నాలజీ వల్ల గదిలో టెంపరేచర్ ప్రకారం ఏసీ ఎంత పని చేయాలో అంతే పని చేస్తుంది.

అదే, నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే గది టెంపరేచర్ మనం ఫిక్స్ చేసిన డిగ్రీలకు చేరుకునేంతవరకు ఆగకుండా పని చేస్తుంది. టెంపరేచర్ తగ్గగానే మళ్ళీ సడన్‌గా అన్ అయిపోతుంది. దానివల్ల కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. కరెంటు ఎక్కువ ఖర్చవుతుంది.

ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ అలా పూర్తిగా ఆగకుండా గదిలో టెంపరేచర్‌ను మెయింటెన్ చేస్తూ అవసరమైన మోతాదులో పని చేస్తుంది. ఇది కొంత ఖరీదైన టెక్నాలజీ. అందుకే వీటి ధర ఎక్కువ. ఇది కాకుండా రెండు రొటేటర్లున్న కంప్రెసర్‌తో మరింత కచ్చితంగా పని చేసే ఏసీ కూడా మార్కెట్లో ఉంది. దాన్ని డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అంటారు. ఇది మరింత వేగంగా గదిని చల్లబరుస్తుంది. విద్యుత్తును కూడా తక్కువగా తీసుకుంటుంది.

5. స్మార్ట్ ఫీచర్లు, వైఫై కనెక్టివిటీ

ఈరోజుల్లో ఏసీలు వైపై కనెక్టివిటీ సౌకర్యంతో, మొబైల్ యాప్‌తో నియంత్రించే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వైఫై లేదా బ్లూటూత్ టెక్నాలజీతో పని చేస్తాయి. వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా వీటిలో ఉంటుంది. అంటే, నోటి మాటతో ఎంత టెంపరేచర్ కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. రిమోట్‌తో మాట్లాడుతూ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంట్లో లేకున్నా రిమోట్‌తో అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఈ ఏసీలను కంట్రోల్ చేయవచ్చు. బయట నుంచి ఇంటికి వస్తున్నప్పుడు గదిని చల్లగా చేయడానికి ముందుగానే ఏసీని ఆన్ చేసుకోవచ్చు. ఇవి లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తాయి. అందుకే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీచర్స్ ఇష్టపడేవారు వీటిని ఎంచుకోవచ్చు.

ఈ అయిదు అంశాలతో పాటు ఏసీ బ్రాండ్ ఎంచుకునే ముందు ఆ కంపెనీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే మెకానిక్ సర్వీస్ సేవలు అందించేందుకు పటిష్టమైన వ్యవస్థ కలిగిన కంపెనీకి చెందిన ఏసీ బ్రాండ్ ఎంచుకుంటే దీర్ఘకాలికంగా మీరు హాయిగా ఉండవచ్చు.

Tags:    

Similar News