Air conditioner: ఎండలకు ముందే ఏసీలకు షాక్

ఈ వేసవిలో ఏసీల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఏ కంపెనీ ఏసీపై ఎంత ధర పెంచింది? మార్కెట్ నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Update: 2026-03-09 06:12 GMT

 Air conditioner: ఎండలకు ముందే ఏసీలకు షాక్

AC price: వేసవి కాలం రాకముందే ఎండలు భగభగమంటున్నాయి. ఏసీల కోసం ఇప్పటికే మార్కెట్లకు జనం క్యూ కడుతున్నారు. కానీ, ఈసారి ఏసీ కొనాలంటే జేబుకు చిల్లు పడక తప్పదు! అవును, ఎయిర్ కండిషనర్ తయారీదారులు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలను భర్తీ చేసేందుకు కంపెనీలు ధరల పెంపు బాట పట్టాయి.

ఎందుకు ఈ ధరల మోత?

ఏసీ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఒకటా రెండా? చాలా ఉన్నాయి.ఏసీ తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం ధరలు గ్లోబల్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి.రూపాయి విలువ తగ్గడం, విదేశీ విడిభాగాల దిగుమతి ఖర్చులు పెరగడం కంపెనీలపై భారం వేస్తున్నాయి.విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ నిబంధనల వల్ల ఏసీలను అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతికత వాడటం కూడా ఖర్చు పెంచుతోంది.మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం వల్ల విడిభాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడి, రవాణా ఖర్చులు పెరిగాయి.

ఏ బ్రాండ్ ఎంత పెంచింది?

ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి.

డైకిన్ ఇండియా: 7 నుంచి 12 శాతం.

వోల్టాస్: 5 నుంచి 15 శాతం.

బ్లూ స్టార్: 8 నుంచి 10 శాతం.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్: 3-స్టార్ మోడళ్లపై 7 శాతం, 5-స్టార్ మోడళ్లపై 9-10 శాతం. హిటాచీ, హైయర్, మిత్సుబిషి ఇవి కూడా 5 నుంచి 8 శాతం వరకు ధరలను పెంచేశాయి. పానాసోనిక్, లాయిడ్ కంపెనీలు త్వరలోనే ఈ జాబితాలో చేరనున్నాయి.

కొనుగోలుదారులకు సూచన

ఐఎండీ సూచనల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఏసీలకు డిమాండ్ ఇంకా పెరిగే కొద్దీ, మరికొన్ని బ్రాండ్లు ధరలను మరింత పెంచే ఛాన్స్ ఉంది. అందుకే, మీరు ఏసీ కొనాలనుకుంటే ఆలస్యం చేయకుండా, ఇప్పుడున్న స్టాక్‌ను కొనుక్కోవడమే ఉత్తమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి కాబట్టి, ముందస్తు ప్రణాళికే మీకు లాభదాయకం.

ఏది ఏమైనా, ఎండల నుంచి ఉపశమనం కోసం ఏసీ తప్పనిసరి అయిన ఈ రోజుల్లో.. ఈ ధరల పెంపు సామాన్యులకు కొంత భారమే. కానీ, ఆధునిక సాంకేతికత, విద్యుత్ ఆదా చేసే ఏసీలను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News