Realme Neo 8: రియల్‌మి కొత్త ఫోన్.. 8,000mAh బ్యాటరీతో దిగేసింది.. ధర ఎంతంటే..?
Realme Neo 8: రియల్‌మి తన జోరును కొనసాగిస్తూ సరికొత్త సంచలనానికి తెరలేపింది. నిన్నమొన్నటి వరకు బ్యాటరీ లైఫ్ అంటే ఒక అంచనా ఉండేది, కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 8,000mAh బ్యాటరీతో 'రియల్‌మి నియో 8'ని చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
Realme Neo 8: రియల్‌మి తన జోరును కొనసాగిస్తూ సరికొత్త సంచలనానికి తెరలేపింది. నిన్నమొన్నటి వరకు బ్యాటరీ లైఫ్ అంటే ఒక అంచనా ఉండేది, కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 8,000mAh బ్యాటరీతో 'రియల్‌మి నియో 8'ని చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు, ఇందులో వాడిన పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ మరియు గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన 165Hz డిస్‌ప్లే ఈ ఫోన్‌ను ఒక పర్ఫార్మెన్స్ బీస్ట్‌గా మార్చేశాయి. ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ ధరను మాత్రం తన నియో సిరీస్ సంప్రదాయానికి తగ్గట్టుగా అందుబాటులోనే ఉంచడం విశేషం.
డిజైన్ పరంగా రియల్‌మి ఈసారి చాలా ప్రయోగాలు చేసింది. వెనుక వైపు ట్రాన్స్‌పరెంట్ ఆర్‌జీబీ (RGB) డిజైన్‌తో కూడిన 'అవేకనింగ్ హాలో' లైటింగ్‌ను మళ్ళీ తీసుకొచ్చింది. ఇది గేమింగ్ ఆడేటప్పుడు లేదా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వెలుగుతూ ఫోన్‌కు అదిరిపోయే లుక్ ఇస్తుంది. దీని మందం కేవలం 8.30mm మాత్రమే ఉన్నప్పటికీ, ఇంత పెద్ద బ్యాటరీని అమర్చడం ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఇక వైట్, పర్పుల్, గ్రే వంటి క్లాసీ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.
డిస్‌ప్లే విషయంలో రియల్‌మి ఎక్కడా తగ్గలేదు. శాంసంగ్ తయారు చేసిన ఎం14 అమోలెడ్ ప్యానల్‌ను ఇందులో వాడారు. 6.78 ఇంచుల పరిమాణం, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమర్లకు ఇది విందు భోజనం లాంటిది. అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్ క్లియర్ గా కనిపించేలా 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీనికి తోడుగా వచ్చే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ వల్ల టచ్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుంది. గీతలు పడకుండా 'క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్' రక్షణ కూడా ఉంది.
కెమెరా సెటప్ చూస్తే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా అమర్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌కు తోడుగా మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది, ఇది 120x వరకు డిజిటల్ జూమ్ చేయగలదు. వైడ్ షాట్ల కోసం 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0తో వస్తున్న ఈ ఫోన్‌కు మూడు ఏళ్ల మేజర్ అప్‌డేట్లు లభిస్తాయి.
ధరల విషయానికి వస్తే, చైనాలో 12GB+256GB బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 31,600 నుంచి మొదలై, టాప్ ఎండ్ 1TB వేరియంట్ దాదాపు రూ. 48,600 వరకు ఉంది. 8,000mAh బ్యాటరీని వేగంగా నింపడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే గేమింగ్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా 'బైపాస్ ఛార్జింగ్' టెక్నాలజీని కూడా అందించారు. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రియల్‌మి నియో 8 ప్రస్తుతానికి చైనాకే పరిమితమైనా, త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.