Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. 51 ఏళ్ల తర్వాత భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు

Yashasvi Jaiswal : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో యశస్వి జైస్వాల్ టీమిండియాకు అద్భుతమైన ఓపెనింగ్ అందించాడు.

Update: 2025-07-24 03:57 GMT

Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. 51 ఏళ్ల తర్వాత భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు

Yashasvi Jaiswal : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో యశస్వి జైస్వాల్ టీమిండియాకు అద్భుతమైన ఓపెనింగ్ అందించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తరఫున, యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్ అవుటైన తర్వాత కూడా యశస్వి తన జోరు తగ్గించకుండా, ఒక పటిష్టమైన ఇన్నింగ్స్ ఆడి ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో చరిత్ర సృష్టించాడు. గత 50 ఏళ్లుగా ఈ మైదానంలో ఏ భారత ఓపెనర్ కూడా చేయని ఒక అరుదైన ఘనతను జైస్వాల్ సాధించాడు.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. 58 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతను 107 బంతులు ఎదుర్కొన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అతని ఈ ఇన్నింగ్స్ భారత జట్టుకు బలం చేకూర్చడమే కాకుండా, అతనికి ఒక ప్రత్యేకమైన రికార్డును కూడా అందించింది. యశస్వి జైస్వాల్ గత 51 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌లకు సవాలుగా నిలుస్తుంది. బౌన్సీ పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడం అంత సులువు కాదు. కానీ, యశస్వి జైస్వాల్ తన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జైస్వాల్‌కి ముందు, ఈ మైదానంలో భారత ఓపెనర్‌గా సునీల్ గావస్కర్ మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, సునీల్ గావస్కర్ ఈ ఘనతను 1974లో సాధించాడు. అంటే, జైస్వాల్‌ 51 ఏళ్ల తర్వాత గవాస్కర్ రికార్డును రిపీట్ చేశాడు.

యశస్వి జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లాండ్‌పై టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై 1 సెంచరీ, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. వీటితో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. అతను ఈ పరుగులను 66.86 సగటుతో సాధించాడు. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 2089 పరుగులు మాత్రమే చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ మొత్తం పరుగులలో దాదాపు సగం పరుగులు (1000 పరుగులు) అతను కేవలం ఇంగ్లాండ్‌పైనే చేయడం విశేషం.

Tags:    

Similar News