Yashasvi Jaiswal: రోహిత్ శర్మ మాటకు తలొగ్గిన జైస్వాల్.. ఆ నిర్ణయం వెనుక అసలు కథ ఇదే!

Yashasvi Jaiswal: భారత క్రికెట్ జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతీరుతో స్థానం సుస్థిరం చేసుకున్నారు.

Update: 2025-08-08 05:08 GMT

Yashasvi Jaiswal: రోహిత్ శర్మ మాటకు తలొగ్గిన జైస్వాల్.. ఆ నిర్ణయం వెనుక అసలు కథ ఇదే!

Yashasvi Jaiswal: భారత క్రికెట్ జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతీరుతో స్థానం సుస్థిరం చేసుకున్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ జైస్వాల్ అదరగొట్టారు. ఒకప్పుడు ముంబై జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన జైస్వాల్, ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవా జట్టుకు మారాలని నిర్ణయించుకున్నా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని తిరిగి ముంబై జట్టులోనే కొనసాగడానికి సిద్ధమయ్యారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే...

యశస్వి జైస్వాల్ తన కెరీర్ ప్రారంభం నుంచీ దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరపున ఆడుతున్నారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో గోవా జట్టుకు మారాలని నిర్ణయించుకుని, ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకున్నారు. త్వరలో జరగబోయే దేశవాళీ టోర్నమెంట్‌లో గోవా తరపున ఆడతారని అందరూ అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా జైస్వాల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నిర్ణయం వెనుక భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు. రోహిత్ శర్మ, జైస్వాల్‌తో మాట్లాడి, 42 సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై వంటి జట్టులో ఆడటం ఎంత గొప్ప విషయమో వివరించారు. ముంబై క్రికెట్ వల్లే జైస్వాల్ తన ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించిందని, తద్వారా టీమిండియాలో స్థానం సంపాదించుకున్నారని రోహిత్ చెప్పడంతో జైస్వాల్ మనసు మార్చుకున్నారని నాయక్ తెలిపారు. రోహిత్ మాటను గౌరవించి, జైస్వాల్ ముంబై జట్టులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

యశస్వి జైస్వాల్ 2019లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‎లో 43 మ్యాచ్‌లలో 66.58 సగటుతో 4233 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్‎లో 33 మ్యాచ్‌లలో 52.62 సగటుతో 1526 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

జైస్వాల్ భారత జట్టు తరపున ఇప్పటివరకు మంచి ప్రదర్శన చేశారు. 24 టెస్ట్ మ్యాచ్‌లలో 50.20 సగటుతో 2209 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌లో అతని అత్యుత్తమ స్కోర్ 214 నాటౌట్. వన్డే మ్యాచ్‌ల్లో 15 సగటుతో 15 పరుగులు చేశారు. 23 టీ20 మ్యాచ్‌లలో 36.15 సగటుతో 723 పరుగులు చేశారు. ఇందులో 1 సెంచరీ కూడా ఉంది. జైస్వాల్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయంలో ముంబై జట్టులోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News