Asia Cup : టీ20 ఫార్మాట్‌పై దృష్టి.. ఆసియా కప్ కోసం భారత జట్టులో కీలక మార్పులు

Asia Cup : టీ20 ఫార్మాట్‌పై దృష్టి.. ఆసియా కప్ కోసం భారత జట్టులో కీలక మార్పులు

Update: 2025-08-18 10:30 GMT

Asia Cup : టీ20 ఫార్మాట్‌పై దృష్టి.. ఆసియా కప్ కోసం భారత జట్టులో కీలక మార్పులు

Asia Cup : ఆసియా కప్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. ఇప్పుడు అందరి దృష్టి భారత జట్టుపై పడింది. ఆగస్టు 19న ముంబైలో జరిగే సమావేశంలో ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలపై, ఏ ఆటగాళ్ల పేర్లపై తుది నిర్ణయం తీసుకుంటారో ఇంకా అధికారికంగా తెలియలేదు. కానీ, తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ లకు ఆసియా కప్ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది.

శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించారు. అక్కడ జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో గిల్ అత్యధికంగా 750 పరుగులు చేయగా, సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఆసియా కప్ టెస్ట్ మ్యాచ్‌ల మాదిరిగా రెడ్ బాల్‌తో కాకుండా, వైట్ బాల్‌తో T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టు ఓపెనింగ్ జోడీగా ఉన్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లను సెలెక్టర్లు మార్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఈ కారణాల వల్ల ఆసియా కప్ జట్టులో గిల్, సిరాజ్‌లకు చోటు దక్కకపోవచ్చని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.

మూడో ఓపెనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్న తలెత్తితే, యశస్వి జైస్వాల్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గంభీర్ గిల్ పట్ల ఆసక్తి చూపితే, భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న అతనికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

ఓపెనింగ్ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ల పేర్లు దాదాపు ఖరారైనట్లు నివేదిక తెలిపింది. ఇందులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ పేర్లు ఉన్నాయి. జితేశ్ శర్మను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. జట్టులో అదనపు బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా వినిపిస్తోంది. అతను తన ఫిట్‌నెస్ పరీక్షను కూడా పాస్ చేశాడు. అయితే, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలిగే ప్లేయర్‌ను ఎంపిక చేయాలని జట్టు భావిస్తే, అయ్యర్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక దాదాపు ఖాయమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ జట్టుకు బలం చేకూర్చే హార్దిక్ తప్పకుండా జట్టులో ఉంటాడు. అతనితో పాటు, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆసియా కప్‌లో ఆడటం ఖాయం. బుమ్రా నేతృత్వంలో పేస్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలు ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. మహ్మద్ షమీ పేరును పరిశీలించే అవకాశం తక్కువగా ఉందని సమాచారం.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లను ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరితో పాటు, టీ20 జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఒక ఆప్షన్. ఒకవేళ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కితే, అతను కూడా స్పిన్నర్ పాత్ర పోషించగలడు. సుందర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ ఆడిన చివరి టీ20 మ్యాచ్‌లో కూడా ఆడాడు. అయితే, అతనికి ఆసియా కప్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు.

Tags:    

Similar News