PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. 500 గెలుపుల మైలురాయిని అందుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డు!
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన కెరీర్‌లో మరో అద్భుత మైలురాయిని చేరుకున్నారు.
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన కెరీర్‌లో మరో అద్భుత మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌లో 500 విజయాలు పూర్తి చేసుకున్న తొలి భారత షట్లర్‌గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఈ చారిత్రాత్మక ఘనతకు వేదికైంది.
ఏకపక్ష పోరులో విజయం: డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్ జాయర్‌ఫెల్డ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సింధు తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కేవలం 43 నిమిషాల్లోనే 21-19, 21-18 వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశారు. లైన్ హోజ్‌మార్క్‌పై సింధుకు ఇది ఐదవ విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ సింగిల్స్‌లో 500 విజయాల మార్కును దాటిన 6వ క్రీడాకారిణిగా నిలిచారు.
క్వార్టర్స్‌లో చెన్ యు ఫీతో ‘బిగ్ ఫైట్’: ప్రస్తుతం ప్రపంచ 13వ ర్యాంకులో ఉన్న సింధు, క్వార్టర్ ఫైనల్స్‌లో కఠినమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. ప్రపంచ 4వ ర్యాంకర్, చైనా స్టార్ క్రీడాకారిణి చెన్ యు ఫీతో ఆమె తలపడనున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు 13 సార్లు తలపడగా, సింధు 7 సార్లు, ఫీ 6 సార్లు గెలుపొందారు. 2019 తర్వాత ఫీ పై విజయం సాధించలేకపోయిన సింధు, ఈ 500వ విజయ స్ఫూర్తితో చైనా షట్లర్‌ను ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. ఇటీవల ఇండియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచిన సింధు, ఈ భారీ విజయంతో తిరిగి ఫామ్‌లోకి రావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.