Asia Cup 2025: స్టేడియంలోనూ ఆపరేషన్ సింధూర్.. టీమిండియాకు ప్రధాని మోడీ స్పెషల్ విషెష్..!

Asia Cup 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో మణించిన టీమిండియా రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ఎగురవేసింది.

Update: 2025-09-29 06:36 GMT

Asia Cup 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో మణించిన టీమిండియా రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ఎగురవేసింది. క్రికెట్ మైదానంలోనూ పాకిస్థాన్ భారతదేశం ముందు మోకరిల్లే సంప్రదాయాన్ని కొనసాగించిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలల క్రితం యుద్ధ భూమిలో భారత దాడులకు పాకిస్థాన్ తలవంచిన విధంగానే ఇప్పుడు క్రికెట్‌లోనూ పరాజయం పాలైంది.

భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఆసియా కప్ టోర్నమెంట్ అనేక వివాదాలను ఎదుర్కొంది. అయితే, అన్ని వివాదాలు, బహిష్కరణ పిలుపుల మధ్య కూడా టీమిండియా పాకిస్థాన్‌ను ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వరుసగా మూడుసార్లు ఓడించింది. మొదటి రెండు మ్యాచ్‌లలో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగా, మూడో గెలుపు కోసం మాత్రం భారత జట్టు చాలా శ్రమించాల్సి వచ్చింది.

టీమిండియా గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తమ సోషల్ మీడియా ఖాతాలో మూడు లైన్ల పోస్ట్‌తో టీమిండియాను అభినందించారు. ప్రధాని మోదీ తన పోస్ట్‌లో.. మైదానంలో ఆపరేషన్ సింధూర్. ఫలితం ఒక్కటే: భారతదేశానికి విజయం. మా క్రికెటర్లకు అభినందనలు అంటూ రాసుకొచ్చారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 146 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ తరఫున ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (57 పరుగులు), ఫఖర్ జమాన్ (46 పరుగులు) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. బౌలింగ్‌లో టీమిండియా తరఫున కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి సంకటంలో పడింది. అయితే, తిలక్ వర్మ (హాఫ్ సెంచరీ) అద్భుతమైన పోరాటం కనబరిచి జట్టును గెలుపు వైపు నడిపించాడు. శివమ్ దూబే 33 పరుగులు, సంజు శాంసన్ 24 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Tags:    

Similar News