IND vs ZIM: రింకూ సింగ్ అవసరం లేదు, మరొకరిని ఆడించండి.. జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IND vs ZIM: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఫిబ్రవరి 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

Update: 2026-02-24 14:22 GMT

IND vs ZIM: రింకూ సింగ్ అవసరం లేదు, మరొకరిని ఆడించండి.. జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IND vs ZIM: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఫిబ్రవరి 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సూపర్-8లోని మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓడిపోవడంతో భారత్ నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించడంతో.. భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలో (జింబాబ్వే, వెస్టిండీస్) గెలవడమే కాకుండా.. భారీ తేడాతో గెలవాలి. అప్పుడే సూర్య సేన నెట్ రన్‌రేట్ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌పై మాజీలు పలు సలహాలు ఇస్తున్నారు.

జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌పై మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టులో ఫినిషర్ పాత్రలో ఉన్న రింకూ సింగ్‌కు సరిపడా బంతులు ఆడే అవకాశం రావడం లేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే జట్టులో హార్దిక్ పాండ్య, శివమ్ దూబే వంటి ఫినిషర్లు ఉన్నందున అదే పాత్ర కోసం రింకూ అవసరం లేదని పేర్కొన్నాడు. జట్టు బ్యాటింగ్ బలం పెంచాలంటే సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురావాలని జహీర్ సూచించాడు. సంజూ నంబర్-3 స్థానంలో ఆడితే మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వం వస్తుందని, అదే సమయంలో పరిస్థితులకు తగ్గట్టు గేమ్‌ను కంట్రోల్ చేయగలడని అన్నాడు.

అలాగే తిలక్ వర్మను నంబర్-5లో ఆడిస్తే బ్యాటింగ్ లోతు పెరుగుతుందని జహీర్ ఖాన్ వివరించాడు. మరో వ్యూహంగా లెఫ్ట్-రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కోసం ఇషాన్ కిషన్‌ను నంబర్-3లో పంపి.. సంజూ శాంసన్‌ను ఓపెనింగ్‌కు పంపొచ్చని కూడా సూచించాడు. ఈ మార్పులతో జట్టు స్పిన్ బౌలింగ్‌కు బలంగా ఎదురుదాడి చేయగలదని జహీర్ విశ్లేషించాడు. జహీర్ వ్యాఖ్యలతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. రింకూ స్థానంలో సంజూను తీసుకోవాలా? లేక ప్రస్తుత కాంబినేషన్‌ను కొనసాగించాలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తుది నిర్ణయం మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది.

Tags:    

Similar News